మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినా జోక్సిమోవిక్ (38) ను అతి దారుణంగా చంపేశారు. అయితే ఆమె భర్తే ఈ హత్య చేసినట్లుగా అధికారులు ధృవీకరించారు. థామస్ (43)గా గుర్తించిన నిందితుడిపై హత్య అభియోగాలు నమోదు చేసినట్లు స్విస్ ప్రాసిక్యూటర్లు ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను చంపేశారు. బిన్నింగెన్‌లోని వారి నివాసంలో థామస్ తన భార్య క్రిస్టినాను మొదట గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి, ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించాడు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం, మృతదేహాన్ని ముక్కలు చేయడానికి రంపపు కత్తి, చెట్లను కత్తిరించే కత్తెరను ఉపయోగించాడు. పారిశ్రామిక బ్లెండర్‌లో శరీర భాగాలను వేసి గుజ్జుగా మార్చి, రసాయన ద్రావణంలో కరిగించే ప్రయత్నం చేశాడు. దర్యాప్తులో పోలీసులు బ్లెండర్‌తో పాటు శరీర చర్మం, ఎముకల ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
మొదట తన భార్య విగతజీవిగా కనిపించిందని చెప్పిన థామస్, మార్చిలో నేరాన్ని అంగీకరించాడు. ఆమె కత్తితో దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసమే చంపినట్లు వాదించాడు. కానీ, ఫోరెన్సిక్ నిపుణులు ఈ వాదనను తోసిపుచ్చారు. ఊపిరాడకపోవడం వల్లే ఆమె మరణించిందని స్పష్టం చేశారు. నిందితుడు అత్యంత క్రూరంగా, కనికరం లేకుండా ప్రవర్తించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. క్రిస్టినా 2007లో మిస్ స్విట్జర్లాండ్ పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచారు.