ఎలాన్ మస్క్ ఇటీవల రూ.3.30 లక్షల కోట్లతో ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించారనే వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ లో ఉన్న స్పామ్ ఖాతాల సంఖ్యపై స్పష్టత వస్తేనే ఈ కొనుగోలు ఒప్పందం ముందుకు సాగుతుందని ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు మస్క్. ట్విట్టర్ లో ఉన్న మొత్తం ఖాతాల సంఖ్యలో నకిలీ ఖాతాల సంఖ్య 5 శాతం కంటే తక్కువేనని ట్విట్టర్ నిర్వాహకులు పక్కా ఆధారాలు చూపిస్తేనే తాను డీల్ కుదుర్చుకుంటానని మస్క్ తేల్చి చెప్పారు. స్పామ్ అకౌంట్లు 5 శాతం కంటే తక్కువ ఉన్నాయని చూపడానికి ట్విట్టర్ సీఈవో బహిరంగంగానే నిరాకరించాడని, ఈ ఒప్పందంలో పురోగతి కనిపించాలంటే స్పామ్ ఖాతాలు ఎన్ని ఉన్నాయో వారు చెప్పాల్సిందేనని మస్క్ స్పష్టం చేశారు.
ట్విట్టర్ చెబుతున్న దానికంటే నకిలీ ఖాతాల సంఖ్య నాలుగు రెట్లు అధికంగా ఉండొచ్చని భావిస్తున్నామని, బహుశా 20 శాతం స్పామ్ అకౌంట్లే ఉండుంటాయని మస్క్ ట్వీట్ చేశారు. తమ టీమ్ ఫేక్, స్పామ్ అకౌంట్లను పట్టుకోవడంలో నిరంతం శ్రమిస్తోందని, అధునాతన పద్ధతుల్లో ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తులు వేస్తూ ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారన్నారు సీఈవో పరాగ్ అగర్వాల్. శాయశక్తుల శ్రమించి ఫేక్ అకౌంట్లను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే ఈ విషయంలో ఎవరికో సందేహాలు ఉన్నాయని... ఫేక్ అకౌంట్లు తేల్చేందుకు బయటి వ్యక్తులకు అవకాశం ఇవ్వడం సాధ్యం కాని పని అంటూ తేల్చి చెప్పాడు.