ఉక్రెయిన్‌కు అండగా ఎలన్‌మస్క్‌.. స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ప్రారంభం

Elon Musk activates Starlink satellite broadband in Ukraine. రష్యా దాడులతో ఉక్రెయిన్‌ దేశం అల్లకల్లోలంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌ దేశానికి ఎలన్‌మస్క్‌ అండగా నిలిచారు.

By అంజి  Published on  27 Feb 2022 1:24 PM IST
ఉక్రెయిన్‌కు అండగా ఎలన్‌మస్క్‌.. స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ప్రారంభం

రష్యా దాడులతో ఉక్రెయిన్‌ దేశం అల్లకల్లోలంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌ దేశానికి ఎలన్‌మస్క్‌ అండగా నిలిచారు. ఉక్రెయిన్‌లో తమ కంపెనీ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు యాక్టివేట్ అయ్యాయని స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ శనివారం తెలిపారు. అలాగే మరిన్ని టెర్మినళ్లను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో ఇంటర్‌ సేవల్లో తీవ్ర అంతరాయం కలిగింది. ఈ కష్ట కాలంలో ఉక్రెయిన్‌ ప్రజలకు సరైన సమాచారం చేరవేయాల్సి ఉంటుంది. లేదంటే ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోక లేక ప్రజలు ఆందోళనకు గురయ్యే ఛాన్స్‌ ఉంది. యుక్రేనియన్ వైస్ ప్రైమ్ మినిస్టర్ మైఖైలో ఫెడోరోవ్.. రష్యా సైనిక కార్యకలాపాల కారణంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగిందని, ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ స్టేషన్లను అందించాలని అమెరికన్ వ్యాపారవేత్త ఎలన్‌మస్క్‌ను కోరారు. వెంటనే స్పందించిన ఎలన్‌మస్క్‌.. తన వంతు సాయంగా స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభించారు. ఎలన్‌మస్క్‌ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

మైఖైలో ఫెడోరోవ్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఇలా రాశారు.. ''ఎలన్‌మస్క్‌.. మీరు మార్స్ గ్రహాన్ని వలసరాజ్యం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తోంది.! మీ రాకెట్లు అంతరిక్షం నుండి విజయవంతంగా ల్యాండ్ అవుతున్నప్పుడు, రష్యన్ రాకెట్లు ఉక్రేనియన్ పౌరులపై దాడి చేస్తున్నాయి! ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్ సేవలను అందించాలని కోరుతున్నాం'' అంటూ ట్వీట్‌ చేశారు. దీనికి స్పందించి మస్క్ ట్వీట్ చేస్తూ.. "స్టార్‌లింక్ సేవలు ఇప్పుడు ఉక్రెయిన్‌లో చురుకుగా ఉన్నాయి. మరిన్ని టెర్మినల్స్ ప్రారంభిస్తాం." అన్నారు. స్టార్‌లింక్ సేవలు ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌లకు యాక్సెస్‌ను అందిస్తాయి. స్పెస్‌ ఎక్స్‌ ద్వారా నిర్వహించబడే స్టార్‌లింక్ ఉపగ్రహాల శ్రేణి, అనేక దేశాలలోని మారుమూల ప్రాంతాల్లో తక్కువ-లేటెన్సీ ఇంటర్నెట్ కవరేజీని అందిస్తోంది.

Next Story