టర్కీలో భారీ భూకంపం.. నేల కూలిన భవనాలు.. 95 మంది మృతి
Earthquake of magnitude 7.8 kills 95, knocks down buildings in Syria and Turkey. టర్కీలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది.
By అంజి Published on 6 Feb 2023 4:43 AM GMTటర్కీలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. ఆగ్నేయ టర్కీలో సంభవించిన భూకంపం కారణంగా భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. భూకంపం కారణంగా ఇక్కడ అనేక భవనాలు కూలిపోయాయి. భూకంపం కారణంగా కనీసం 95 మంది మరణించారని స్థానిక మీడియా ద్వారా తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు సిరియాలో భూకంపం కారణంగా చాలా భవనాలు కూలిపోయాయి. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:17 గంటలకు టర్కీలో భూకంపం సంభవించింది.
దీని లోతు భూమి లోపల 17.9 కిలోమీటర్లు. టర్కీలోని గాజియాంటెప్ సమీపంలో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. టర్కీలోని ఉస్మానియాలో 34 భవనాలు ధ్వంసమయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని టర్కీ అధ్యక్షుడు రజబ్ తయ్యబ్ ఎర్దుగాన్ ట్వీట్ చేశారు. ఒకే సమయంలో కనీసం 6 భూకంపాలు సంభవించాయి. దెబ్బతిన్న భవనాల్లోకి ప్రవేశించవద్దని ఎర్డుగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మలత్య ప్రావిన్స్‌లో 23, సాన్లియుర్ఫాలో 17, దియార్‌బాకిర్‌లో ఆరుగురు, ఉస్మానియేలో ఐదుగురు మృతి చెందారు.
ఉత్తర సిరియాలో కనీసం 42 మంది మరణించారు.ప్రకంపనలు సిరియా, లెబనాన్, సైప్రస్‌లో చాలా బలంగా ఉన్నాయి. ఉత్తర సిరియాలోని అలెప్పోలో కూడా పలు భవనాలు కూలిపోయాయని అధికారులు తెలిపారు. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున దక్షిణ టర్కీలో రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది, ఆ తర్వాత 6.7 తీవ్రతతో మరో బలమైన భూకంపం సంభవించింది. ప్రారంభ భూకంపం గాజియాంటెప్ ప్రావిన్స్‌లోని నూర్దగి నగరానికి తూర్పున 26 కి.మీ దూరంలో 17.9 కి.మీ లోతులో కేంద్రీకృతమై ఉంది. రెండవది నిమిషాల తర్వాత సెంట్రల్ టర్కీలో 9.9 కి.మీ లోతులో తాకింది. తూర్పున 350 కిమీ దూరంలోని దియార్‌బాకిర్‌లో.. ఈ ప్రకంపన ఒక నిమిషం పాటు కొనసాగింది. కిటికీలు పగిలిపోయాయి.
భూకంపం కారణంగా అనేక భవనాలు కూలిపోయాయని, చాలా మంది శిథిలాల మధ్య చిక్కుకున్నారని బీఎన్‌వో న్యూస్ తెలిపింది. ట్విట్టర్‌లో షేర్ చేయబడిన వీడియోల్లో.. భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రజలు ప్రాణాల కోసం అరుస్తూ పరుగులు తీస్తున్నారు. టర్కిష్ రెడ్‌క్రాస్ చీఫ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి తీవ్రమైన నష్టం, కూలిపోయిన భవనాల సమాచారం అందినందున వనరులను సమీకరించడం జరిగిందన్నారు. దెబ్బతిన్న ఇళ్లను ఖాళీ చేయాలని ప్రజలను కోరారు. సిరియా రాజధాని డమాస్కస్‌తో పాటు లెబనీస్ నగరాలైన బీరూట్, ట్రిపోలీలోని ప్రజలు కాలినడకన వీధిలోకి పరిగెత్తారు.