అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున 3.39 గంటలకు శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్‌లోని మోంటే క్యూమాడోకు 104 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు వచ్చాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదైంది. భూకంప కేంద్రం కోర్డోబాకు ఉత్తరాన 517 కి.మీ దూరంలో 586 కి.మీ లోతులో భూ కంప కేంద్రాన్ని యూఎస్ జియోలాజికల్ గుర్తించింది. ఈ ప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇండోనేషియాలో జనవరి నెలలో ఇప్పటివరకు మూడుసార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. జనవరి 18న ఒక్కరోజులో రెండుసార్లు భూమి కంపించింది. ఇండోనేషియా తూర్పు ప్రాంతంలో 6.1 తీవ్రతతో తొలి భూకంపం సంభవించింది. ఆ తర్వాత తూర్పు ఇండోనేషియాలోనే 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు ఇండోనేషియాలోని పశ్చిమ ప్రాంతంలో 6.0 తీవ్రతతో భూమి కంపించింది.