ఇరాన్ దేశంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఇరాన్ చిగురుటాకులా వణికిపోయింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.1గా నమోదైంది. హర్మోజ్‌గంజ్ ప్రావిన్స్‌లోని ఓడరేవు పట్టణం బందర్ అబ్బాస్‌లో భూమి కంపించింది. అబ్బాస్‌కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
ఈ ప్రాంతంలో పలు మార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రతలు 4.6, 4.4, 6.0, 6.3గా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఈ ప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
టెక్టోనిక్ ప్లేట్ల అంచున వివిధ ఫాల్ట్ లైన్‌లను దాటుతున్న ఇరాన్ దేశం బలమైన భూకంప కార్యకలాపాల కేంద్రాలకు నెలవు. ఇరాన్ దేశంలో 1990వ సంవత్సరంలో పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4 గా నమోదైంది. ఈ భూకంపం వల్ల ఉత్తర ఇరాన్ దేశంలో 40,000 మంది ప్రాణాలు కోల్పోయారు.