తుర్కియోలో మరోసారి భూ ప్రకంపనలు.. 34 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య
Earthquake of magnitude 4.7 strikes Turkey.సహాయక చర్యలు కొనసాగుతుండగా మరోసారి తుర్కియోలో భూమి కంపించింది
By తోట వంశీ కుమార్ Published on 13 Feb 2023 3:42 AM GMTవారం రోజుల క్రితం తుర్కియే, సిరియాలో భూ కంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకంపనలు తుర్కియే, సిరియాలను కోలుకోలేని దెబ్బ తీశాయి. వేల సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి. ముఖ్యంగా తుర్కియేలో ఎటుచూసినా చూసిన శిథిలాలే కనిపిస్తున్నాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండగా మరోసారి అక్కడ భూమి కంపించింది. ఆదివారం తుర్కియే దక్షిణ నగరమైన కహ్రమన్మరాస్‌లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.7గా నమోదైంది.
ఇదిలా ఉంటే మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. తుర్కియేలో 29,605 మంది, సిరియాలో 4,574 మందితో కలిపి మొత్తం 34, 179 మంది మరణించారు. 92 వేల మందికి పైగా క్షతగాత్రులు మారినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు లక్షలాది మంది సర్వం పోగొట్టుకుని కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగిలారు. వారికి కనీస వసతులు కల్పించడం కూడా ప్రభుత్వానికి సవాలుగా మారింది. దీంతో బాధితుల్లో ఆక్రోశం ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంటోంది.
ఇంకోవైపు.. భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. భూకంపం వచ్చి ఆదివారంతో ఆరు రోజులు పూర్తి అయ్యాయి. అయినప్పటికీ కొంత మంది ప్రాణాలు నిలుపుకుని శిథిలాల నుంచి బయటపడుతున్నారు. ఆదివారం హతాయ్ ప్రావిన్సులో ఓ గర్భిణీని గుర్తించిన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆదిమాయన్ నగరంలో మరో ఇద్దరు చిన్నారులను, అన్‌టాకియా నగరంలో ఓ వ్యక్తిని సిబ్బంది రక్షించారు.