Pakistan: హిందూ డాక్టర్ గొంతు కోసి చంపిన డ్రైవర్, అరెస్ట్
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ధరమ్ దేవ్ రాఠీని మంగళవారం అతని ఇంటిలోనే అతని డ్రైవర్ హత్య చేశాడు.
By అంజి Published on 9 March 2023 2:45 PM ISTహిందూ డాక్టర్ గొంతు కోసి చంపిన డ్రైవర్, అరెస్ట్
పాకిస్తాన్‌లో దారుణ ఘటన జరిగింది. ఆ దేశంలోని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ధరమ్ దేవ్ రాఠీని మంగళవారం అతని ఇంటిలోనే అతని డ్రైవర్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డ్రైవర్ కత్తితో డాక్టర్ గొంతు కోశాడని పోలీసులు పాకిస్థాన్ వార్తా సంస్థ ది నేషన్‌కు తెలిపారు. నిందితుడు డ్రైవర్‌ను ఖైర్‌పూర్‌లోని అతని ఇంట్లో పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడిని హనీఫ్ లెఘారీగా గుర్తించారు. ఇంటికి వెళ్తుండగా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు వైద్యుడి వంట మనిషి పోలీసులకు తెలిపారు. అక్కడికి చేరుకున్న డ్రైవర్ వంటగదిలోంచి కత్తి తీసుకుని తన ఇంట్లోనే వైద్యుడిని హత్య చేశాడు. అనంతరం డాక్టర్ కారులో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
డాక్టర్ ధరమ్ దేవ్ రాతి హైదరాబాద్ ప్రాంతంలో ప్రసిద్ధ చర్మవ్యాధి నిపుణుడు అని ది నేషన్ నివేదిక తెలిపింది. నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేసినందుకు పాకిస్థాన్ మైనారిటీ వ్యవహారాల మంత్రి జియాన్ చంద్ ఎస్సారానీ పోలీసులను ప్రశంసించారు. అలాగే హత్యకు గురైన డాక్టర్ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) మహిళా విభాగం చీఫ్ ఫర్యాల్ తల్పూర్ హత్యను ఖండించారు. ఈ సంఘటనను "హృదయ విదారకంగా" పేర్కొన్నారు. డాక్టర్ కుటుంబానికి న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యంగా హిందూ సమాజం హోలీ సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ ఘటన బాధ కలిగించిందని ఆమె పేర్కొన్నారు.