బందీలను రిలీజ్ చేయకుంటే అంతుచూస్తా..హమాస్‌కు ట్రంప్ వార్నింగ్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్‌కు హెచ్చరిక జారీ చేశారు.
By Knakam Karthik Published on 6 March 2025 12:01 PM IST
బందీలను రిలీజ్ చేయకుంటే అంతుచూస్తా..హమాస్‌కు ట్రంప్ వార్నింగ్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్‌కు హెచ్చరిక జారీ చేశారు. ఆ సంస్థ చెరలో ఉన్న మిగిలిన బందీలను రిలీజ్ చేయకుంటే గాజాను మరింత నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా ఓ పోస్టు చేశారు. ‘మీ వద్ద బందీలుగా ఉన్న వారందరినీ వెంటనే విడుదల చేయాలి. మరణించిన వారి మృతదేహాలను తిరిగివ్వాలి. లేకుంటే తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. అందుకు ఇజ్రాయెల్‌కు కావాల్సిన ప్రతిదాన్ని పంపుతాను. నేను చెప్పినట్లు చేయకపోతే హమాస్‌కు చెందిన ఒక్క వ్యక్తి కూడా సురక్షితంగా ఉండడు. మీ చెరలో బందీలుగా ఉండి ఇటీవల విడుదలైన వారిని నేను కలిశాను. ఇదే మీకు చివరి హెచ్చరిక. గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు వేచి చూస్తోంది. మీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి’ అని ట్రంప్ రాసుకొచ్చారు.
కాగా ఇప్పటికే అనేకసార్లు హమాస్‌కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. బందీలను విడుదల చేయకుంటే అంతు చూస్తానంటూ పలుమార్లు బెదిరించారు. ఈ క్రమంలో ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో గాజాలోని పరిస్థితులపై ట్రంప్ చర్చించారు. అనంతరం గాజాను స్వాదీనం చేసుకుని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పాలస్తీనియన్లు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లి శాశ్వతంగా స్థిరపడాలని సూచించారు. ఈ ప్రతిపాదనలను సౌదీ, జోర్దాన్‌తో సహా మిత్ర దేశాలన్నీ వ్యతిరేకించాయి.