అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్వస్థతకు గురయ్యారని, ఆయన ఆసుపత్రిలో చేరారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ నిరాధారమైన వదంతులని స్పష్టం చేసింది.
అసలేం జరిగింది?
శనివారం ఉదయం వైట్‌హౌస్ అధ్యక్షుడి బహిరంగ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు 'ప్రెస్ లిడ్' ప్రకటించడంతో ఈ పుకార్లు షురూ అయ్యాయి. దీనికి తోడు, ట్రంప్ కాన్వాయ్‌కు సంబంధించిన ఒక పాత వీడియోను ఇప్పుడు ఆసుపత్రికి వెళ్తున్న దృశ్యాలుగా వైరల్ చేశారు. అయితే, ఆ వీడియో 2024లో పెన్సిల్వేనియా కాల్పుల ఘటన తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినప్పటిదని తేలింది.
వైట్‌హౌస్ వివరణ:
వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చుంగ్ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చుతూ.. "ట్రంప్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఈ ఈస్టర్ వారాంతంలో కూడా ఆయన ఓవల్ ఆఫీస్‌లో దేశం కోసం నిరంతరంగా పనిచేస్తున్నారు" అని స్పష్టం చేశారు. మధ్యాహ్నం సమయంలో వెస్ట్ వింగ్ వద్ద మెరైన్ సైనికుడు కాపలాగా ఉండటాన్ని గమనించిన జర్నలిస్టులు, అధ్యక్షుడు భవనంలోనే ఉన్నారని ధృవీకరించారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ తప్పుడు ప్రచారం చేశారని వైట్‌హౌస్ వర్గాలు మండిపడ్డాయి.