ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు చుట్టు ముట్టిన నేపథ్యంలో చాలా కంపెనీలు వ్యయ నియంత్రణతో పాటు ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాయి. అందులో భాగంగా అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి బడా కంపెనీలతో పాటు చిన్న కంపెనీలు సైతం ఎడాపెడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాము కూడా ఏమీ తక్కువ కాదన్నట్లు ఇప్పుడు ఈ జాబితాలో వాల్డ్ డిస్నీ చేరింది. ఏకంగా 7 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు వెల్లడించింది.
అక్టోబర్ 1 నాటికి డిస్నీలో 2,20,000 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో దాదాపు 1,66,000 మంది USలో పనిచేస్తున్నారు. మొత్తం ఉద్యోగుల్లో 7000 మందిని తొలగించనున్నట్లు ఆ సంస్థ సీఈవో బాబ్ ఇగెర్ తెలిపారు. దీని వల్ల 5.5 బిలియన్ల ఆదా అవుతుందని, స్ట్రీమింగ్ వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా మార్చవచ్చునని చెప్పారు.
"ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ఇది అవసరం. అయితే నేను ఈ నిర్ణయం తేలికగా తీసుకోలేదు" అని బాబ్ ఇగెర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఉద్యోగుల ప్రతిభ, అంకితభావం పట్ల అపారమైన నమ్మకం ఉందన్నారు.
ఇదిలా ఉంటే.. గత మూడు నెలల్లో ఒక శాతం వినియోగదారులు డిస్నీ+కి దూరం అయ్యారు. ప్రస్తుతం 168.1మిలియన్ యూజర్లు ఉన్నారు. ఇప్పటికే డిస్నీ కొత్త నియామకాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.