సాధారణంగా తల్లిదండ్రులు తమ చిన్నారులను కంటి రెప్పలా కాపాడుకుంటారు. బిడ్డలకు ఎలాంటి కష్టం రాకుండా తమకు ఉన్నదాంట్లో ఎంతో అపురూపంగా చూసుకుంటుంటారు. అయితే.. ఇప్పుడు చెప్పబోయే ఘటన గురించి వింటే.. ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారా..? అనిపించకమానదు. బిడ్డకు టికెట్ కొనడం ఇష్టం లేక విమానాశ్రయంలోనే వదిలి విమానం ఎక్కేందుకు వెళ్లారు. ఈ ఘటన ఇజ్రాయెల్ దేశంలో చోటు చేసుకుంది.
జనవరి 31న ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో ఉన్న బెన్ గురియస్ ఎయిర్‌పోర్టులో బ్రస్సెల్స్ వెళ్లే విమానం ఎక్కేందుకు బెల్జియం పాస్‌పోర్టులున్న దంపతులు వచ్చారు. అప్పటికే సమయం మించి పోతుండడంతో హడావుడిగా వచ్చిన వారిని టెర్మినల్ కౌంటర్ 1 వద్ద అధికారులు ఆపారు. టికెట్లు చూపాలని కోరారు. ఆ దంపతులు రెండు టికెట్లు మాత్రమే చూపించారు. భుజంపైన ఉన్న చిన్నారికి సైతం టికెట్ తీసుకోవాలని అధికారులు సూచించారు.
దీంతో కాసేపు సిబ్చందితో వాగ్వాదానికి దిగింది ఆ జంట. మరో టికెట్ కొనేందుకు నిరాకరించారు. అంతేనా.. భుజంపైన ఉన్న చిన్నారిని అక్కడే కౌంటర్ వద్ద విడిచిపెట్టి వారిద్దరూ విమానం ఎక్కేందుకు వెళ్లారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు.
టికెట్ అడిగితే.. బిడ్డను కూడా వదిలివెళ్లే ఇలాంటి తల్లిదండ్రులను తాము ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. అసలు ఇలాంటి వారు కూడా ఉంటారని తాను కలలో కూడా ఊహించలేదని విమానాశ్రయ అధికారి తెలిపారు.