భగవంతుడా.. అక్కడికి కూడా కరోనా చేరిపోయిందిగా..!
Coronavirus Reaches End Of Earth As First Outbreak Hits Antarctica. కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాపించేసింది.
By Medi Samrat Published on 23 Dec 2020 5:57 PM IST
కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాపించేసింది. ఇప్పుడు రెండో రకం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వెంటాడుతూ ఉంది. ఇన్నాళ్లూ అంటార్కిటికా ఖండంలో కరోనా లేదని అనుకునే వాళ్ళం.. ఇప్పుడు ఆ ఖండంలో కూడా కరోనా చేరిపోయింది. అంటార్కిటికాలోని చిలీకి చెందిన రెండు స్థావరాల్లోని సైనికులకు వైరస్ నిర్ధారణ అయ్యింది. సైనిక స్థావరాల్లోని 36 మంది వైరస్ బారినపడినట్టు నిర్ధారణ అయ్యింది. వీరిలో 10 మంది అక్కడి అధికారుల ఇళ్లలో విధులు నిర్వర్తిస్తున్న సాధారణ పౌరులు.
మంగళవారం మరో 21 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. వీరంతా సెర్జియాంట్ ఆల్డీ అనే నౌకలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నౌక సాయంతో సైనిక స్థావరాలలోని సైనికులకు అవసరమైన సరకులను రవాణా చేస్తుంటారు. ఓ లెఫ్టినెంట్ స్థాయి అధికారి ఇంట్లో పనిచేసే సామాన్య పౌరుడికీ పాజిటివ్‌గా తేలింది. అంటార్కిటికాలో తమ దేశానికి చెందిన మొత్తం 58 మందికి వైరస్ సోకినట్లు చిలీ సైన్యం ప్రకటించింది. బెర్నార్డ్ ఓ హిగ్గిన్స్ బేస్‌లో కనీసం 36 మందికి వైరస్ సోకిందని తెలిపింది. వీరిని ఐసోలేషన్‌లో ఉంచి, ఆరోగ్యశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నట్టు ఆర్మీ తెలిపింది. కోవిడ్ సోకినవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
అంటార్కిటికాలో తమ దేశ కార్యకలాపాలను కోసం పని చేస్తున్న సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అమెరికా ప్రకటించింది. కరోనా బారిన పడ్డ చిలీ సైనికులతో అమెరికా సిబ్బంది కాంటాక్ట్‌లో లేరని స్పష్టం చేసింది.