నేపాల్‌లో ఉద్రిక్తతలు..అప్రమత్తమై సరిహద్దు మూసివేసిన భారత్
భారత్‌కు ఆనుకుని ఉన్న నేపాల్ ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.
By - Knakam Karthik |
నేపాల్‌లో ఉద్రిక్తతలు..అప్రమత్తమై సరిహద్దు మూసివేసిన భారత్
భారత్‌కు ఆనుకుని ఉన్న నేపాల్ ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. నేపాల్‌లోని పర్సా జిల్లా బీర్గంజ్ పట్టణంలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. పరిస్థితి చేయి దాటడంతో జిల్లా యంత్రాంగం బీర్గంజ్ నగరంలో కర్ఫ్యూ విధించింది. ఈ పట్టణం బిహార్‌లోని రాక్సౌల్‌కు సమీపంలో ఉండటంతో భారత్ కూడా అప్రమత్తమైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోతో ఈ ఉద్రిక్తతలకు తెరలేచింది. ధనూషా జిల్లా కమలా మున్సిపాలిటీకి చెందిన హైదర్ అన్సారీ, అమానత్ అన్సారీ అనే ఇద్దరు వ్యక్తులు మతపరమైన భావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వీడియోను పోస్టు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాప్తి చెందడంతో పర్సా, ధనూషా జిల్లాల్లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. స్థానికులు ఆ ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అయితే ఆ తర్వాత కమలా ప్రాంతంలోని సఖువా మారన్‌లో ఒక మసీదును ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. హిందూ సంఘాలు తమ దేవతలను కించపరిచే వ్యాఖ్యలు జరిగాయని ఆరోపించడంతో ఆగ్రహం మరింత పెరిగింది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నిరసనకారులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు దాదాపు అరడజను టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. బీర్గంజ్ నగరంలో కర్ఫ్యూ అమలు చేస్తూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
భారత్–నేపాల్ సరిహద్దు పూర్తిగా మూసివేత
బీర్గంజ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండటంతో భారత్–నేపాల్ సరిహద్దును పూర్తిగా మూసివేశారు. సశస్త్ర సీమా బల్ (SSB) సరిహద్దు భద్రతను మరింత కఠినతరం చేసింది. అత్యవసర సేవలు తప్ప సాధారణ ప్రజల రాకపోకలను నిలిపివేశారు. భారత్–నేపాల్‌ను కలిపే మైత్రి బ్రిడ్జ్ వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సరిహద్దు దాటే ప్రతి వ్యక్తిని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. భద్రతను మరింత బలోపేతం చేసేందుకు డాగ్ స్క్వాడ్‌ను కూడా మోహరించారు. సహదేవా, మహదేవా, పంతోకా, సీవన్ టోలా, ముషర్వా వంటి ఇతర సరిహద్దు ప్రాంతాల్లోనూ పట్రోలింగ్ పెంచారు.
నేపాల్ నుంచి భారత్‌కు వలస కార్మికుల తిరుగు ప్రయాణం
పరిస్థితులు మరింత దిగజారడంతో నేపాల్‌లో పనిచేస్తున్న పలువురు భారతీయ వలస కార్మికులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. బీర్గంజ్‌లోని అన్ని దుకాణాలు, మార్కెట్లు పూర్తిగా మూసివేసినట్టు అక్కడ పనిచేస్తున్న భారతీయుడు రాకేష్ తెలిపారు. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత మళ్లీ పని కోసం వస్తాను. ఇప్పుడిప్పుడు అక్కడ ఉండటం అవసరం లేదు,” అని ఆయన చెప్పారు. పరిస్థితిపై నేపాల్, భారత్ భద్రతా సంస్థలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి.