మా వైపు నుండి చాలా పెద్ద తప్పు జరిగింది..!
అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు, చికాగో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జాన్ మీషిర్మర్ ట్రంప్ భారత్ పట్ల వ్యవహరిస్తున్న విధానాన్ని పెద్ద తప్పుగా అభివర్ణించారు.
By Medi Samrat
అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు, చికాగో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జాన్ మీషిర్మర్ ట్రంప్ భారత్ పట్ల వ్యవహరిస్తున్న విధానాన్ని పెద్ద తప్పుగా అభివర్ణించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై విధించిన సెకండరీ టారిఫ్‌లు పనిచేయవని ఆయన చెప్పారు. ఈ చర్య అమెరికా, భారతదేశం మధ్య సంబంధాలను దెబ్బతీసిందని..భారతదేశం ఇప్పుడు అమెరికా నుండి దూరం అవుతున్నట్లు కనిపిస్తోందని మీర్‌షీమర్ హెచ్చరించారు. "ఇది మా వైపు నుండి జరిగిన చాలా పెద్ద తప్పు, ఇక్కడ ఏమి జరుగుతుందో నమ్మడం కష్టం," అని అతను చెప్పాడు.
రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేది లేదని భారత్ స్పష్టం చేసిందన్నారు. భారతీయులు ఎలాంటి ఒత్తిడికి తలొగ్గడం లేదు. అమెరికా, భారత్‌ల మధ్య బలమైన సంబంధాలను ట్రంప్ ప్రభుత్వం విషపూరితం చేసిందని మీర్‌షీమర్ ఆరోపించారు. చైనాను ఆపడం అమెరికా అతిపెద్ద విదేశాంగ విధాన ప్రాధాన్యత.. భారతదేశం ఇందులో ముఖ్యమైన భాగస్వామి. అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల పరిస్థితి మరింత దిగజారిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఫోన్‌లో నాలుగుసార్లు సంప్రదించడానికి ప్రయత్నించారని, అయితే ప్రధాని మోదీ మాట్లాడడానికి నిరాకరించారని పేర్కొన్నారు.
"భారతీయులు మాపై చాలా కోపంగా ఉన్నారు. ప్రధాని మోడీ రష్యాకే కాకుండా చైనాకు కూడా దగ్గరవుతున్నారు. ఈ విధానం అసమర్థమైనది మాత్రమే కాదు, వ్యతిరేక ప్రభావాన్ని చూపుతోంది" అని ఆయన అన్నారు. ఈ విఫలమైన వ్యూహానికి వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోను మీర్‌షీమర్ నిందించారు. ఈ నిర్ణయం వల్ల ఎలాంటి మంచి ఫలితం రాదన్నారు. భారత్ ఒత్తిడికి తలొగ్గుతుందని అమెరికా ఆలోచిస్తోందా అని ప్రశ్నించారు. భారతదేశాన్ని మోకాళ్లపైకి తెచ్చేంత శక్తి మనకు ఉందా? దీన్ని నమ్మే వారెవరూ కనిపించడం లేదని, భారత్ ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలు ఈ వ్యూహం తప్పని స్పష్టంగా తెలియజేస్తోందని ఆయన అన్నారు.