కరోనా పై యుద్ధానికి భారత్ కు సహకరిస్తామన్న జిన్‌పింగ్‌

Chinese President Xi Jinping offers help to India.భారత్‌లో కరోనా సృష్టిస్తున్న విపత్కర పరిస్థితులపై చైనా అధ్యక్షుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2021 7:38 AM IST
కరోనా పై యుద్ధానికి భారత్ కు సహకరిస్తామన్న జిన్‌పింగ్‌

భారత్‌లో కరోనా సృష్టిస్తున్న విపత్కర పరిస్థితులపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసారు. భారత్ కు చేయగలిగినంత సహాయం చేస్తామని ప్రధాని మోదీకి సంఘీభావ సందేశం పంపారు. భారత్‌లో కరోనా మహమ్మారిని ఓడించేందుకు జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేసేందుకు సహకరిస్తామని ఈ సందేశంలో జిన్‌పింగ్‌ పేర్కొన్నారు.

ప్రధాని మోదీకి జిన్‌పింగ్‌ పంపిన లేఖకు సంబంధించిన వివరాలను భారత్‌లోని చైనా రాయబారి సన్‌ వేడాంగ్‌ తన అధికారిక ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. వివిధ దేశాల మధ్య సహకారం, సంఘీభావంతోనే ఈ మహమ్మారిని ఓడించగలమని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు. భారత ప్రభుత్వ నాయకత్వంలో ప్రజలు ఈ మహమ్మారి సంక్షోభాన్ని అధిగమిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

అంతకు ముందే కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు శాయశక్తులా అండగా నిలుస్తామని చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్‌ యీ చెప్పారు. కరోనాపై పోరులో ఉపకరించే సామగ్రి చైనా నుంచి భారత్‌కు సాధ్యమైనంత వేగంగా రవాణా అయ్యేలా చర్యలు చేపడతామన్నారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు వాంగ్‌ ఓ లేఖ రాశారు. భారత్‌లో చైనా రాయబారి సన్‌ వేడాంగ్‌ ఆ లేఖను గురువారం ట్విటర్‌లో ఉంచారు.

భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణపై చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయినా సరే ఈ సమయంలో చైనా నుంచి భారత్‌ పట్ల సానుకూల వైఖరి వ్యక్తమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Next Story