కరోనా వైరస్ గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వేవ్‌ల రూపంలో వెంటాడుతూనే ఉంది. కొత్త వేరియంట్‌ల రూపంలో విజృంభిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. ఇక ఈ మహమ్మారి పుటినిల్లును కనుగొనడంలో శాస్త్రవేత్తలు విఫలం అయ్యారు. అయితే.. చాలా మంది చైనా దేశాన్ని కరోనా పుట్టినిల్లుగా బావిస్తున్నారు. తాజాగా చైనాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈశాన్య నగరమైన చాంగ్‌చున్ లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తుండడంతో శుక్రవారం అక్కడ లాక్‌డౌన్ విధించారు.
ఫలితంగా 90 లక్షల మంది ఉన్న ఆ నగరంలో ప్రస్తుతం కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతోనే లాక్‌డౌన్‌ను విధించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా.. స్థానికులు ఇళ్ల నుంచి అస్సలు బయటికి రావొద్దని ఆదేశించారు. నిత్యావసరాల కోసం రెండు రోజులకు ఒకసారి ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటకు వచ్చి తీసుకోవాలని తెలిపారు. నగరంలోని ప్రజలు మూడు సార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. అత్యవసం కాని సేవలను రద్దు చేశారు. ట్రాస్న్‌పోర్ట్ లింకులను కూడా మూసివేశారు.