కరోనా వైరస్ కు పుట్టినిల్లుగా చైనాను చెబుతూ ఉంటారు. ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. చైనా కూడా తమ దగ్గర ఓ వ్యాక్సిన్ ఉందని వెల్లడించింది. కానీ పెద్దగా ఇతర దేశాలు ఆసక్తి చూపించలేదు. ఇలాంటి తరుణంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కరోనా టీకాను తీసుకున్నారంటూ కథనాలు వస్తూ ఉన్నాయి. తమ దేశంలో కరోనా అన్నదే రాకుండా చేసిన కిమ్.. ఇప్పుడు ఏకంగా చైనా తయారు చేసిన వ్యాక్సిన్ ను తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. చైనాలో తయారైన ఓ టీకాను తీసుకున్నారన్న విషయాన్ని వాషింగ్టన్ కేంద్రంగా నడుస్తున్న సెంటర్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్ సంస్థ ప్రతినిధి హారీ కజియానిస్ వెల్లడించారు. కిమ్ కుటుంబీకులు, ముఖ్యమైన అధికారులు కూడా వ్యాక్సిన్ ను వేయించుకున్నారని అంటున్నారు. చైనాలో పలు రకాల టీకాలు అభివృద్ధి దశలో ఉన్నాయి.. కిమ్ ఏది వాడారన్న విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. ప్రపంచ దేశాలు మొత్తం కరోనా టీకా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఏ వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని అనుమతులను ఇస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.