అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఓర్లీన్స్ లోని బౌర్ బాన్ స్ట్రీట్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనంపై షంషుద్దీన్ జబ్బార్ ట్రక్కుతో దూసుకెళ్లి బీభత్సం సృష్టించాడు. అనంతరం వారిపై కాల్పులు జరిపాడు. అతడు వీలైనంత ఎక్కువ మందిని చంపాలనే ఆకాంక్షతోనే ఈ దారుణానికి తెగబడ్డాడని అమెరికా చెబుతోంది. అమెరికా ఎఫ్బీఐ చేస్తున్న దర్యాప్తులో నరమేధానికి పాల్పడేందుకు జబ్బార్ కుట్రపన్నాడని తేలింది.
వేడుకలు జరుగుతున్న ప్రాంతంలో సాధ్యమైనంత మందిని ట్రక్కుతో ఢీకొట్టి చంపేందుకు అతను ప్లాన్ చేసుకున్నాడు. న్యూ ఓర్లీన్స్ లో జరిగింది ఉగ్రదాడిగానే భావిస్తున్నామని అమెరికా తెలిపింది. ఈ ఘటన వెనుక జబ్బార్ కాకుండా మరి కొంతమంది హస్తం ఉందని, అతడికి టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని అమెరికా అధికారులు తెలిపారు. ట్రక్కుతో దూసుకెళ్లిన తర్వాత కిందకు దిగిన జబ్బార్ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అయితే పోలీసులు అతడిని అక్కడికక్కడే కాల్చిపారేశారు. జబ్బార్ నడిపిన వాహనంలో తుపాకులు, పైప్ బాంబులు, ఐసిస్ జెండా దొరికాయి. షంషుద్దీన్ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. దాడికి దిగే ముందు జబ్బార్ కొన్ని వీడియోలను కూడా రిలీజ్ చేశాడు. ఐసిస్ నుంచి స్ఫూర్తి పొందానని అందులో చెప్పాడు. సొంత కుటుంబాన్నీ చంపాలనుకున్నట్టు జబ్బార్ వీడియోలో ఒప్పుకున్నాడు.