కరోనా తరువాత చికెన్ తినే వారి సంఖ్య పెరిగింది అనేది కాదనలేని వాస్తవం. ఒకప్పుడు ఆదివారం లేదంటే స్పెషల్ డేస్‌లలో మాత్రమే చికెన్‌ను తినేవారు. ప్రస్తుతం చాలా మందికి రోజు చికెన్ లేనిదే ముద్ద దిగడం లేదు. అలాంటి వారికి ఇది షాకింగ్ న్యూసే. చికెన్ ధర చుక్కులను తాకింది. కిలో చికెన్ ధర రూ.720కి చేరింది. దీంతో కొనేది ఎలాగా అని అంటున్నారు సాధారణ ప్రజలు. అయితే.. ఇది మనదేశంలో కాదులెండి. మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో.
ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశంలో నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. రూ.490 ఉన్న కేజీ చికెన్ ధర ఒక్కసారిగా రూ.720కి చేరింది. కరాచీ, రావల్సిండి, ఇస్లామాబాద్ వంటి నగరాల్లో కేజీ చికెన్‌ను కొనాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. చికెన్ రేటు రికార్డు స్థాయిలో పెరగడం ఇదే తొలిసారని వారు అంటున్నారు.
అయితే.. ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడానికి కారణం పౌల్ట్రీ వ్యాపారాలు మూతపడడమే అని అంటోంది అక్కడి మీడియా. కోళ్ల ఫీడ్ కు కొరత ఏర్పడి పౌల్ట్రీ వ్యాపారులు బిజినెస్ నిలిపివేశారట. దీంతో ధరలు ఆకాశాన్ని అంటున్నాయి.
దీనిపై అక్కడి ప్రభుత్వం విచారణ చేపట్టింది. చికెన్ ధరలను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది.