రాత్రి 8.30 గంట‌ల‌కే మార్కెట్లు, మాల్స్ బంద్‌

Cash-strapped Pak announces early closure of markets.పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jan 2023 11:02 AM IST
రాత్రి 8.30 గంట‌ల‌కే మార్కెట్లు, మాల్స్ బంద్‌

దాయాది పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించ‌గా, స‌బ్సిడీల భారాన్ని మోయ‌లేక చాలా వాటిని కోత పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఓ వైపు దేశంలో నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. ద్ర‌వ్యోల్భ‌ణం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు పాక్ పొదుపు బాట ప‌ట్టింది. ఇంధ‌నాన్ని ఆదా చేయ‌డంతో పాటు చ‌మురు దిగుమ‌తుల‌ను త‌గ్గించేందుకు మంగ‌ళ‌వారం పాక్ కేబినెట్ స‌మావేశ‌మైంది. ఈ భేటీలో అనేక నిర్ణ‌యాలు తీసుకున్నారు. మార్కెట్లు, మాల్స్ మరియు కళ్యాణ మండపాలను సాధార‌ణ స‌మ‌యం కంటే ముందుగానే మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇంధనాన్ని ఆదా చేయడానికి, దిగుమతి చేసుకున్న చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్లాన్‌కు పాకిస్తాన్ క్యాబినెట్ మంత్రులు మంగళవారం ఆమోదం తెలిపారు. దీనిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. "మార్కెట్లు, మాల్స్ ఇప్పుడు రాత్రి 8:30 గంటలకు మూసివేయబడతాయి. అయితే వివాహ మందిరాలు రాత్రి 10:00 గంటలకు మూసివేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రూ. 60 బిలియన్లను ఆదా చేసుకోవ‌చ్చు. ఫిబ్రవ‌రి 1 నుంచి సాధార‌ణ బ‌ల్చుల త‌యారీని ఆపివేస్తున్నాం. జులై నుంచి నాసిర‌కం ఫ్యాన్ల ఉత్ప‌త్తిని నిలిపివేస్తున్నాం. ఈ చ‌ర్య‌ల వ‌ల్ల మ‌రో రూ.22 బిలియ‌న్ ఆదా అవుతాయి అని అన్నారు.

కొనిక‌ల్ గీజ‌ర్ల వాడాకాన్ని సంవ‌త్స‌రం లోపు త‌ప్ప‌నిస‌రి చేయ‌నున్నాం. దీని వ‌ల్ల త‌క్కువ గ్యాస్ వినియోగంతో 92 బిలియ‌ర్లు ఆదా అవుతుంది. వీధి దీపాల్లో మార్పులు చేయ‌డం ద్వారా మ‌రో 4బిలియ‌న్లు ఆదా అవుతుంది. అన్ని ప్ర‌భుత్వ భ‌వ‌నాలు, కార్యాల‌యాలు కూడా ప్ర‌ణాళిక ప్ర‌కారం ఇంధ‌న వినియోగాన్ని త‌గ్గిస్తాయి. ఇంటి నుంచి ప‌ని చేసే విధానాన్ని(వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌) 10 రోజుల్లో అమ‌లు చేస్తాం అని మంత్రి చెప్పారు. ఇక ఈ రోజు జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో లైట్లు వేయ‌లేద‌న్నారు. కేవ‌లం సూర్య కాంతి ద్వార‌నే స‌మావేశాన్ని నిర్వ‌హించిన‌ట్లు చెప్పుకొచ్చారు.

ఏదీఏమైన‌ప్ప‌టికీ ఈ ఏడాది చివ‌రి నాటికి ఎల‌క్ట్రిక‌ల్ బైక్‌ల‌ను అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. వాతావ‌ర‌ణ మార్పుల స‌మ‌స్య ప‌రిష్కారానికి కూడా ఈ ప్ర‌ణాళిక స‌హాయం చేస్తుంద‌ని మంత్రి షెర్రీ రెహ్మాన్ తెలిపారు. "ప్రపంచం కొంతకాలంగా ఈ ప్రణాళికను అనుసరిస్తోంది. మన అలవాట్లను మార్చుకోవడం మాకు అత్యవసరం" అని చెప్పారు.

Next Story