కాంబోడియాలోని క్యాసినోలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది సజీవదహనం

Cambodia Hotel Casino Fire 10 killed.కంబోడియాలో ఘోర అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Dec 2022 5:12 AM GMT
కాంబోడియాలోని క్యాసినోలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది సజీవదహనం

కంబోడియాలో ఘోర అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 10 మంది మృతి చెంద‌గా, మ‌రో 30 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు.

థాయ్‌లాండ్-కాంబోడియా స‌రిహ‌ద్దుల్లో ఉన్న పోయిపేట్ పట్టణంలోని గ్రాండ్ డైమండ్ సిటీ క్యాసినో హోటల్‌లో స్థానిక కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం రాత్రి 11.30 గంట‌ల‌కు స‌మ‌యంలో మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లోనే మంట‌లు ఉవ్వెత్తున ఎగిసిప‌డ్డాయి. ఆ స‌మ‌యంలో క్యాసినోలో 400 మంది ఉన్న‌ట్లు స‌మాచారం. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క‌, రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కనిపించిన అనేక వీడియో ఫుటేజీలు భారీ కాంప్లెక్స్ మంటలను చూపించాయి. కొన్ని వీడియోల్లో ప్ర‌జ‌లు త‌మ ప్రాణాలు కాపాడుకునేందుకు భ‌వ‌నం కిటికీల్లోంచి దూకడం క‌నిపించింది. మంటలు చెలరేగినప్పుడు చాలా మంది విదేశీయులు కూడా హోటల్‌లో ఉన్నారని మీడియా నివేదికలు సూచించాయి.

అయితే.. మరణించిన వారి జాతీయత ఇంకా నిర్ధారించబడలేదు. థాయ్‌లాండ్ సరిహద్దు పట్టణంలో హోటల్ ఉన్నందున వారు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. గాయ‌ప‌డిన వారిని థాయ్‌లాండ్‌లోని సా కెయో ప్రావిన్స్‌లోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 80శాతం మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు స్థానిక మీడియా తెలిపింది. అగ్నిమాపక చర్య కొనసాగడంతో ఉదయం వరకు 50 మందికి పైగా ర‌క్షించిన‌ట్లు చెప్పాయి.

Next Story