సహోద్యోగిని 'ఆంటీ' అని పిలిచినందుకు రూ. 1.8 లక్షల జరిమానా విధించిన కోర్టు..!
బ్రిటన్‌లో ఒక మహిళను 'ఆంటీ' అని పిలవడం ఇప్పుడు మీకు చిక్కులను తెచ్చిపెట్టవచ్చు.
By - Medi Samrat |
బ్రిటన్‌లో ఒక మహిళను 'ఆంటీ' అని పిలవడం ఇప్పుడు మీకు చిక్కులను తెచ్చిపెట్టవచ్చు. భారతదేశంలో ఈ పదాన్ని గౌరవానికి చిహ్నంగా పరిగణిస్తుండగా, యూకే కార్యాలయాల్లో దీనిని వయస్సు, లింగ ఆధారిత వేధింపుగా పరిగణిస్తారు.
భారత సంతతికి చెందిన హెల్త్‌కేర్ అసిస్టెంట్ ఇల్డా ఎస్టెవ్స్ (64) మనోవేదనకు గాను, పశ్చిమ లండన్‌లోని ఒక NHS ట్రస్ట్ ఆమెకు £1,425 (సుమారు రూ. 1.8 లక్షలు) నష్టపరిహారం చెల్లించాలని ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్ జడ్జి ఇలియట్ తీర్పు ఇచ్చారు.
కేసు ప్రకారం.. ఘనా దేశానికి చెందిన నర్సు సహోద్యోగి చార్లెస్ ఒప్పోంగ్, ఇల్డాను పని చేసే చోట పదేపదే "ఆంటీ" అని పిలిచేవాడు. ఇల్డా పదేపదే అతడి మాటను మధ్యలో ఆపినా.. ఒప్పోంగ్ అలానే పిలిచేవాడు. జూన్ 2023లో, 61 ఏళ్ల జార్జ్ అనే వృద్ధ ఉద్యోగికి ఇల్డా మంచి భాగస్వామి అవుతుందని కూడా ఒప్పోంగ్ సూచించాడు.
ట్రిబ్యునల్ వద్ద ఒప్పోంగ్ ఆ ఆరోపణలను ఖండించినప్పటికీ, తాను ఒకసారి ఆమెను "ఆంటీ" అని పిలిచినట్లు అంగీకరించాడు. ఘనా సంస్కృతిలో "ఆంటీ" అనేది పెద్దలను గౌరవంగా పిలిచే పదం అని, అయితే ఇల్డాకు అది నచ్చకపోవడంతో, అది ఆమెను కించపరిచినట్లుగా భావించారని న్యాయమూర్తి ఇలియట్ అంగీకరించారు.
న్యాయమూర్తి ఇలా అన్నారు. "ఇది మంచి ప్రవర్తన కాదు. పని ప్రదేశంలో చేసిన వ్యాఖ్యలు ఆ మహిళను బాధకు గురిచేశాయి. ఇది ఫిర్యాదుదారురాలి వయస్సు, లింగానికి సంబంధించిన వేధింపు కిందకు వస్తుంది." తన గుర్తింపును గోప్యంగా ఉంచాలన్న ఆమె అభ్యర్థనను తిరస్కరించినప్పటికీ, ట్రిబ్యునల్ ఇల్డాపై వేధింపుల వాదనను సమర్థించింది.