భారత్-చైనా దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ఓ వైపు చైనా ఎన్నో కుటిలయత్నాలకు ప్రయత్నిస్తూ ఉండగా.. మరో వైపు భారత్ కూడా చైనాను ఆర్థికంగా దెబ్బతీయడానికి అన్ని మార్గాలను ఎంచుకుంటూ ఉంది. భారత ప్రజలు కూడా చైనా ప్రోడక్ట్స్ ను కొనడం బాగా తగ్గించేశారు. ఇక దీపావళి సమయంలో చైనాలో తయారైన టపాసులు, వస్తువులు భారీగా భారత్ లోకి వస్తూ ఉంటాయి. అయితే ఈసారి ఆ విషయంలో చైనాను భారత్ బాగా దెబ్బతీసింది. ఈ దీపావళికి చైనా సరకులను బాయ్ కాట్ చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ( సీఏఐటీ) వ్యాపారులకు పిలుపునిచ్చింది.
దీంతో చైనాకు సుమారు 50 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని సీఏఐటీ తెలిపింది. దేశంలోని ప్రధాన నగరాల్లోని వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని దీని ప్రభావంతో భారతీయ వస్తువులకు డిమాండ్‌ను పెరుగుతున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. 20 ముఖ్యమైన నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఇప్పటివరకు దీపావళి వస్తువులు, బాణసంచా లేదా ఇతర వస్తువుల కోసం చైనా ఎగుమతిదారులకు భారతీయ వ్యాపారులు లేదా దిగుమతిదారులు ఎటువంటి ఆర్డర్‌లు ఇవ్వలేదని తేలిందని అన్నారు. భారతీయులు దేశీయ వస్తువుల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి చైనా భారీగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి.