ఇరు దేశాల జాతీయ గీతాలు భూమిని 'తల్లి'గా సూచిస్తాయి
ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియాలో పర్యటిస్తున్నారు.
By - Medi Samrat |
ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియాలో పర్యటిస్తున్నారు. ఇథియోపియా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ.. ఇథియోపియాను సింహాల భూమిగా అభివర్ణించారు. ఈ దేశాన్ని తాను ఇల్లులా భావిస్తున్నానని అన్నారు. అలాగే ఇరుదేశాల జాతీయగీతాలను పోల్చుతూ.. రెండు దేశాల జాతీయగీతాల్లో భూమిని తల్లి అని పిలుస్తున్నారని అన్నారు.
ఇథియోపియా పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈరోజు మీ అందరి ముందు నిలబడడం నాకు గొప్ప అదృష్టం అని అన్నారు. ప్రాచీన జ్ఞానం, ఆధునిక ఆకాంక్షలు కలిగిన దేశం హృదయంలో, ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండటం నాకు గౌరవంగా ఉందన్నారు. 1.4 బిలియన్ల భారతీయుల శుభాకాంక్షలను తనతో తీసుకువస్తున్నానని, ఇథియోపియా పార్లమెంటు, ఈ దేశ ప్రజలు, వారి ప్రజాస్వామ్య ప్రయాణం పట్ల తనకు ప్రగాఢ గౌరవం ఉందన్నారు. ఈ బృహత్తర భవనంలో ప్రజల అభీష్టమే దేశ అభీష్టం అవుతుందన్నారు.
తనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ హానర్ మార్క్ ఆఫ్ ఇథియోపియాను ప్రదానం చేసినందుకు ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ ప్రజల తరపున నేను ఈ గౌరవాన్ని ముకుళిత హస్తాలతో, వినమ్రంగా స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు.
ఇథియోపియా ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతలలో ఒకటిగా అభివర్ణించిన ప్రధాన మంత్రి.. ఈ దేశ చరిత్ర పర్వతాలు, లోయలు, ప్రజల హృదయాలలో సజీవంగా ఉందని అన్నారు. భారతదేశ జాతీయ గీతం వందేమాతరం, ఇథియోపియా జాతీయ గీతం రెండూ భూమిని "తల్లి" అని సూచిస్తున్నాయని అన్నారు.