కాబూల్‌లోని గురుద్వారా వ‌ద్ద‌ జంట పేలుళ్లు.. భార‌త్ ఆందోళ‌న‌

Blasts Near Gurdwara In Afghanistan's Kabul.అఫ్గానిస్థాన్‌లో ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు. రాజ‌ధాని కాబూల్ న‌గ‌రంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2022 7:14 AM GMT
కాబూల్‌లోని గురుద్వారా వ‌ద్ద‌ జంట పేలుళ్లు.. భార‌త్ ఆందోళ‌న‌

అఫ్గానిస్థాన్‌లో ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు. రాజ‌ధాని కాబూల్ న‌గ‌రంలో జంట పేలుళ్లకు పాల్ప‌డ్డారు. న‌గ‌రంలోని కార్తే ప‌ర్వాన్ గురుద్వారా వ‌ద్ద ఆ పేలుళ్లు జ‌రిగిన‌ట్లు స్థానిక మీడియా వెల్ల‌డించింది. పేలుళ్ల స‌మ‌యంలో ఆ ప్రాంతంలో చాలా మంది భ‌క్తులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా.. అదే ప్రాంతంలో కాల్పుల శ‌బ్ధాలు కూడా వినిపించాయి.

జ‌నం ర‌ద్దీగా ఉండే ఆ ప్రాంతంలో అనేక మంది చ‌నిపోయి ఉంటార‌ని స్థానిక మీడియా తెలిపింది. గురుద్వారా ద‌శ్‌మేశ్ పితా సాహిబ్ జీకి ఉన్న రెండు గేట్ల వ‌ద్ద పేలుళ్లు జ‌రిగిన‌ట్లు వెల్ల‌డించింది. గాయ‌ప‌డ్డ ఇద్ద‌ర్ని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించామ‌ని, గురుద్వారా వ‌ద్ద గార్డు సెక్యూర్టీ గార్డ్ అహ్మ‌ద్‌ను కాల్చి చంపిన‌ట్లు స్థానిక నేత‌ తెలిపారు. గురుద్వారా నుంచి పెద్ద ఎత్తున పొగ బ‌య‌ట‌కు వ‌స్తున్న ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై భార‌త విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప‌రిస్థితిని ద‌గ్గ‌రి నుంచి గ‌మ‌నిస్తున్న‌ట్లు తెలిపింది. స‌మాచారం కోసం వేచి చూస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఇదిలా ఉంటే.. ఉద‌యం 6 గంట‌ల స‌మ‌యంలో కార్వే ప‌ర్వాన్ ప‌రిస‌ర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పేలుడు శ‌బ్ధం వినిపించింద‌ని, అర‌గంట త‌రువాత మ‌రో పేలుడు సంభ‌వించింద‌ని ప్రత్య‌క్ష స్థాకిని ఉటంకిస్తూ ఓ అంత‌ర్జాతీయ ఛాన‌ల్ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ప్ర‌స్తుతం ఘ‌ట‌నాస్థ‌లాన్ని పూర్తిగా భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇది ఐసీస్ ఉగ్ర‌దాడిగానే బావిస్తున్నారు.

Next Story