మసీదులో ఆత్మాహుతి దాడి.. 66 మంది దుర్మరణం
Blast kills more than 50 at Kabul mosque.అఫ్గానిస్థాన్ బాంబు దాడులతో అట్టుడుకుతోంది. మరోసారి బాంబు
By తోట వంశీ కుమార్
అఫ్గానిస్థాన్ బాంబు దాడులతో అట్టుడుకుతోంది. మరోసారి బాంబు పేలుళ్లు విధ్వంసం సృష్టించాయి. పవిత్ర రంజాన్ మాసంలో ప్రజలే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడుతున్నారు. గత 10 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో 11 ఉగ్రదాడులు జరిగాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రాజధాని కాబూల్ పట్టణంలోని ఖలీఫా సాహిబ్ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 66 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో వంద మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
రంజాన్ మాసంలో చివరి శుక్రవారం కావడంతో ఖలీపా సాహిబ్ మసీదులో ప్రార్థనలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో మసీదు కిక్కిరిపోయింది. ప్రార్థనలు ముగిసే సమయంలో.. ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. పెద్ద శబ్థంతో పేలుడు సంభవించింది. దీంతో మసీదులో భయానక వాతావరణం నెలకొంది. ఘటన తరువాత మసీదులో ఎక్కడ చూసినా.. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, క్షతగాత్రులే కనిపించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పేలుళ్ల వెనుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉండొచ్చునని అధికారులు అనుమానిస్తుండగా.. ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ దీనికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.
కాగా.. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. అభద్రత మధ్య నిత్యం హింసకు గురవుతున్న అఫ్గాన్ ప్రజలకు ఇది మరో బాధాకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేసింది.