ఇండియన్-అమెరికన్ అయిన రవి చౌదరిని పెంటగాన్ పదవికి జో బైడెన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏరోస్పేస్, రక్షణ నిపుణుడు, యూఎస్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్నత స్థానాల్లో పనిచేసిన రవి చౌదరిని పెంటగాన్ అసిస్టెంట్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు వైట్ హౌస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వర్జీనియాలో నివసించే రవి చౌదరికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెంటగాన్‌లో ఎయిర్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్టాలేషన్స్, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అసిస్టెంట్ సెక్రటరీ బాధ్యతలను అమెరికా ప్రభుత్వం రవి చౌదరికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది.
బరాక్ ఒబామా కాలంలో ప్రెసిడెంట్ అడ్వైజరీ కమిషన్‌లో సభ్యుడుగా రవి చౌదరి ఉన్నారు. రవి నియామకానికి ప్రస్తుతానికి ప్రెసిడెంట్ జో బైడెన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినా.. యూఎస్ పార్లమెంట్ తుది ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ లో అన్ని ఇన్‌స్టాలేషన్‌లు, వ్యూహాలను సిద్ధం చేసే బాధ్యత అతడిపై ఉంటుంది. రవి చౌదరి 1993 నుంచి 2015 వరకు అమెరికా వైమానిక దళంలో క్రియాశీలంగా ఉన్నారు. అతను సీ-17 పైలట్ కూడా. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధంలో అనేక ఆపరేషన్లు చేపట్టాడు.
చౌదరి నాసా స్టెల్లార్ అవార్డు, మెరిటోరియస్ సర్వీస్ మెడల్, ఎయిర్ మెడల్ మరియు ఇరాక్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రచార పతకాలతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు. అతను ప్రస్తుతం తన భార్య ఉమ మరియు వారి ఇద్దరు పిల్లలతో వర్జీనియాలో నివసిస్తున్నారు.