అధ్య‌క్షుడి భ‌వ‌నం వ‌ద్ద విమాన క‌ల‌క‌లం.. జోబైడెన్ దంప‌తుల త‌ర‌లింపు

Biden evacuated after plane entered airspace near beach home.అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ నివాసం వ‌ద్ద ఓ విమానం క‌ల‌కలం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jun 2022 12:37 PM IST
అధ్య‌క్షుడి భ‌వ‌నం వ‌ద్ద విమాన క‌ల‌క‌లం.. జోబైడెన్ దంప‌తుల త‌ర‌లింపు

అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ నివాసం వ‌ద్ద ఓ విమానం క‌ల‌కలం సృష్టించింది. నిషేదిత గ‌గ‌న‌త‌లంలోకి ఓ విమానం రావ‌డంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది అధ్య‌క్షుడు జో బైడెన్‌, ఆయ‌న భార్య జిల్ బైడైన్‌ను సుర‌క్షిత ప్ర‌దేశానికి త‌ర‌లించారు. వారికి ఎలాంటి ముప్పు లేద‌ని శ్వేత సౌధం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. పొర‌బాటుగానే ఆ విమానం నిషేదిత ప్రాంతంలోకి ప్ర‌వేశించింద‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేల‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. జో బైడెన్, ఆయ‌న స‌తీమ‌ణితో క‌లిసి డెలావేర్‌లోని రిహోబ‌త్ బీచ్‌లోని అధ్య‌క్ష విడిదికి వెళ్లారు. వాషింగ్ట‌న్‌కు రూ.200 కి.మీ దూరంలో ఇది ఉంటుంది. కాగా.. ఓ చిన్న విమానం పొర‌బాటున నిషేదిత గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించింది. ఒక్కసారిగా భద్రతా సిబ‍్బంది అలర్ట్‌ అయ్యారు. ఆగమేఘాలపై బైడెన్, ఆయన జీవిత భాగస్వామిని అక్కడి నుంచి సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు.

భ‌ద్ర‌తా విమానాలు గ‌గ‌న‌త‌లంలోనే ఆ విమానాన్ని త‌మ నియంత్ర‌ణ‌లోకి తీసుకుని అక్క‌డి నుంచి ప‌క్క‌కు తీసుకువెళ్లాయి. స్థానిక కాల‌మానం ప్రకారం శ‌నివారం మ‌ధ్యాహ్నాం 1 గంట స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇక విమానం పొర‌బాటుగా ప్ర‌వేశించింద‌నే తెలియ‌గానే జోబైడెన్ తిరిగి నివాసానికి చేరుకున్నారు.

కాగా.. విమానంలో ఉన్న ఫైల‌ట్ స‌రైన రేడియో ఛాన‌ల్ ద్వారా అందుబాటులోకి రాలేద‌ని, ఫ్లైట్ గైడెన్స్ కూడా పాటించ‌లేద‌ని అధికారులు తెలిపారు. నిషేదిత ప్రాంతంపై పైల‌ట్‌కు అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ పొర‌బాటు జ‌రిగింద‌ని విచార‌ణ‌లో తేలింద‌న్నారు.

Next Story