Video : ఆత్మాహుతి దాడితో వ‌ణికిన పాక్.. వీడియో విడుదల చేసిన బీఎల్‌ఏ

బలూచ్ తిరుగుబాటుదారులు ఇటీవ‌ల‌ పాకిస్థాన్‌లో రైలు హైజాక్ ఘటనకు పాల్పడ్డారు.

By Medi Samrat
Published on : 17 March 2025 11:29 AM IST

Video : ఆత్మాహుతి దాడితో వ‌ణికిన పాక్.. వీడియో విడుదల చేసిన బీఎల్‌ఏ

బలూచ్ తిరుగుబాటుదారులు ఇటీవ‌ల‌ పాకిస్థాన్‌లో రైలు హైజాక్ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న మ‌రిచిపోక ముందే తాజాగా ఆదివారం బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేసి ఐదుగురిని చంపారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను బలూచ్ రెబల్స్ స్వయంగా విడుదల చేశారు.

బలూచిస్థాన్‌లోని నోష్కీలో హైవేపై బలూచ్ తిరుగుబాటుదారులు ఈ దాడికి పాల్పడ్డారు. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఈ దాడికి బాధ్యత వహిస్తూ వీడియోను విడుదల చేసింది. పేలుడు సంభవించిన తర్వాత బస్సులో నుంచి పొగలు కమ్ముకున్నట్లు వీడియోలో చూడవచ్చు.

పేలుడు పదార్థాలతో కూడిన వాహన కాన్వాయ్‌ను ఆత్మాహుతి బాంబర్ ఢీకొట్టినట్లు ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు చెబుతున్నాయని దాడి గురించి పాక్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

న్యూస్ ఏజెన్సీ పిటిఐ నివేదిక ప్రకారం పోలీసు అధికారి మాట్లాడుతూ 'పేలుడు తర్వాత.. మరికొందరు ఉగ్రవాదులు ఎఫ్‌సి సిబ్బందిపై కాల్పులు జరిపారు. అయితే ప్రతీకార కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ఈ దాడిలో ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరులు కూడా మరణించారు.

ఈ దాడికి ముందు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) క్వెట్టాలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసింది. సామాన్య ప్రజలతో పాటు ఆర్మీ జవాన్లు 36 గంటల పాటు బందీలుగా ఉన్నారు.

Next Story