భారత్ ఆగితే.. మేము కూడా ఆగిపోతాం : పాకిస్థాన్

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ స్పష్టం చేశారు

By Medi Samrat
Published on : 10 May 2025 2:32 PM IST

భారత్ ఆగితే.. మేము కూడా ఆగిపోతాం : పాకిస్థాన్

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ స్పష్టం చేశారు. భారత్ ఇక్కడ ఆగిపోతే, మేము కూడా ఆగిపోయే అంశాన్ని పరిశీలిస్తామని ఇషాక్ దార్ చెప్పినట్లుగా పాక్ మీడియా నివేదికలను ప్రచురించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు తెలియజేశానని అన్నారు. న్యూఢిల్లీతో మాట్లాడిన అనంతరం రూబియో తనను సంప్రదించారని దార్ తెలిపారు. పాకిస్థాన్ సంయమనం పాటిస్తే, ఘర్షణలను పెంచబోమని భారత్ స్పష్టం చేసింది.

ఉద్రిక్తతలను తగ్గించి, న్యూఢిల్లీతో చర్చలు జరపడానికి ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని పాక్ అధికారిక వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించి, శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉందని పలు దేశాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించాలని, ఇరు దేశాలు సంయమనం పాటిస్తూ దాడుల నివారణకు చర్యలు తీసుకోవాలని అమెరికా సూచించింది.

Next Story