Video : కుప్పకూలిన ప్యాసింజర్‌ విమానం.. 42 మంది మృతి

అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్యాసింజర్‌ విమానం బుధవారం కజకిస్థాన్‌లో కుప్పకూలింది.

By Medi Samrat  Published on  25 Dec 2024 2:26 PM IST
Video : కుప్పకూలిన ప్యాసింజర్‌ విమానం.. 42 మంది మృతి

అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్యాసింజర్‌ విమానం బుధవారం కజకిస్థాన్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదం కజకిస్థాన్‌లోని అక్తావు సమీపంలో జరిగింది. ఈ ప్ర‌మాంలో 42 మంది మృతి చెందిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విమానం అజర్‌బైజాన్‌ నుంచి రష్యాకు వెళ్లింది. ఈ విమానంలో 67 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. కజకిస్థాన్ అధికారులు 12 మంది ప్రాణాలతో బయటపడినట్లు నివేదించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ల్యాండింగ్ సమయంలో విమానం నేలను ఢీకొని మంటలు చెలరేగడం వీడియోలో చూడవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.

ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేస్తూ.. J2-8243 ఫ్లైట్ నంబర్ గ‌ల‌ ఎంబ్రేయర్ 190 విమానం.. బాకు నుండి చెచ్న్యాకు బయలుదేరింది. అయితే దట్టమైన పొగమంచు కారణంగా విమానం వెళ్లే మార్గాన్ని దారి మళ్లించాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని కజకిస్థాన్ అధికారులు తెలిపారు. ప్రమాదం వెనుక సాంకేతిక లోపం ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.

విమానంలో అజర్‌బైజాన్‌కు చెందిన 37 మంది, కజకిస్థాన్‌కు చెందిన 6, కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన 3, రష్యాకు చెందిన 16 మంది పౌరులు ఉన్నారు. విమానంలో ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 67 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో 150 మంది రెస్క్యూ సిబ్బంది మరియు 45 పరికరాలను మోహరించారు.

Next Story