కొండపై నుండి.. అదుపుతప్పి కిందపడ్డ బస్సు.. 20 మంది మృతి

At least 20 die after bus veers off cliff in Ethiopia. ఉత్తర ఇథియోపియాలో ఆదివారం నాడు విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. కొండపై నుండి కిందపడిపోయింది.

By అంజి
Published on : 25 Jan 2022 10:18 AM IST

కొండపై నుండి.. అదుపుతప్పి కిందపడ్డ బస్సు.. 20 మంది మృతి

ఉత్తర ఇథియోపియాలో ఆదివారం నాడు విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. కొండపై నుండి కిందపడిపోయింది. ఈ ఘటనలో కనీసం 20 మంది మరణించినట్లు, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యినట్లు స్థానిక మీడియా తెలిపింది. అమ్హారా ప్రాంతీయ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఫనా బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేట్‌ ఈ విషయాన్ని పేర్కొంది. ఇథియోపియాలో ట్రాఫిక్‌ ప్రమాదాలు చాలా సాధారణం. చాలా మంది నిర్లక్ష్యపు డ్రైవింగ్,భద్రతా నియమాలను సక్రమంగా అమలు చేయడం వంటి వాటితో పాటు రోడ్లు సరిగ్గా లేకపోవడం ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.

మరోవైపు సోమాలియాలోని దక్షిణ ప్రాంతంలోని స్థానిక రెస్టారెంట్‌లో జరిగిన పేలుడులో ఆరుగురు మరణించగా, మరో పది మంది గాయపడ్డారని స్థానిక భద్రతా అధికారులు తెలిపారు. రాజధాని మొగదిషుకు ఉత్తరాన దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిడిల్ షాబెల్లే ప్రాంతంలోని ఖాలిమో పట్టణంలోని టీ దుకాణంలో సోమవారం పేలుడు సంభవించిందని భద్రతా అధికారులు ప్రభుత్వ యాజమాన్యంలోని సోమాలియా జాతీయ టెలివిజన్‌కు తెలిపారు. సోమాలియాలో తాజా దాడులకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. అయితే అల్-షబాబ్ మిలిటెంట్లు తరచుగా మొగదిషు, ఇతర ప్రాంతాలలో ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని స్థానిక మీడియా తెలిపింది.

Next Story