ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది మృతి, 50 మందికి గాయాలు
ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చమురు డిపోలో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి
By తోట వంశీ కుమార్ Published on 4 March 2023 3:20 AM GMTఆయిల్ డిపోలో ఎగిసిపడుతున్న మంటలు
ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ఆయిల్ డిపోలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అవి చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
ఉత్తర జకార్తాలోని తనహ్ మేరా పరిసరాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతానికి సమీపంలో ప్రభుత్వ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీకి చెందిన పెర్టామినా ఆయిల్ డిపో ఉంది. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. చుట్టు పక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే రెస్య్కూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
సమీపంలోని వేలాది మంది ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించాయి. మంటలను అదుపు చేసేందుకు యాభైకి పైగా ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. 260 మంది అగ్నిమాపక గంటల పాటు ఎంతో శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. 17 మంది మరణించగా.. మరో 50 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
శుక్రవారం కురిసిన భారీ వర్షంతో పాటు పిడుగులు పడడంతో మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఆ తర్వాత అది అనేక పేలుళ్లకు కారణమైందని చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారన్నారు.
స్థానిక మీడియాలో ప్రసారమైన అగ్నిప్రమాద వీడియోల్లో వందలాది మంది ప్రజలు భయంతో పరుగులు తీయడం కనిపించింది. దేశీయ ఇంధన అవసరాల్లో 25 శాతం మేర ఈ డిపో నుంచి సరఫరా అవుతోంది. అయితే.. అగ్నిప్రమాదం కారణంగా ఇంధన సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగదని అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంపై ఇండోనేషియా రాష్ట్ర-యాజమాన్య సంస్థల మంత్రి ఎరిక్ థోహిర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, ప్రమాదంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.