హాంగ్‌కాంగ్‌లోని ఉత్తర తాయ్ పో జిల్లాలో నివాస సముదాయాలైన బహుళ అంతస్తుల టవర్‌లపై భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో బుధవారం కనీసం 13 మంది మరణించారు.. చాలా మంది మంటలలో చిక్కుకున్నారని ప్రభుత్వం తెలిపింది.
31-అంతస్తుల టవర్ల నుండి దట్టమైన నల్లటి పొగలు, మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు చాలా కష్టపడుతున్నారు. మంటలు చెలరేగిన వాంగ్ ఫక్ కోర్ట్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో ఎనిమిది బ్లాకులతో కూడిన 2,000 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. భవనాల లోపల ఇంకా ఎంత మంది ఉన్నారనే సమాచారం తమ వద్ద లేదని ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ రాయిటర్స్‌కి తెలిపింది. వాంగ్ ఫక్ కోర్టులో మంటలు చెలరేగాయని మధ్యాహ్నం 2:51 గంటలకు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ తెలిపింది. బలమైన గాలుల కారణంగా మంటలు కాంప్లెక్స్‌లోని ఎనిమిది బ్లాకుల్లో ఏడింటికి వ్యాపించాయని వెల్లడించింది.
వాంగ్ ఫక్ కోర్ట్ హాంకాంగ్‌లోని ఎత్తైన గృహ సముదాయాలలో ఒకటి. ఇది ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఒకటి. చైనా ప్రధాన భూభాగానికి సమీపంలో ఉన్న తాయ్ పో.. సుమారు 300,000 జనాభా గల జిల్లా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హౌసింగ్ మార్కెట్‌లలో ఒకటైన హాంగ్‌కాంగ్‌లో అద్దెలు రికార్డు స్థాయిలో ఉన్నందున చాలా మందికి ఇంటిని సొంతం చేసుకోవడం సుదూర కల. ఈ సముదాయం ప్రభుత్వ సబ్సిడీ గృహ యాజమాన్య పథకం కింద ఉంది. ఆస్తి ఏజెన్సీ వెబ్‌సైట్‌ల ప్రకారం.. ఇది 1983 నుండి నివాసానికి అందుబాటులో ఉంది.