ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 127 మంది మృతి

At least 127 people killed in riot at football match in Indonesia.అప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ ఎంతో ఉల్లాసంగా ఫుట్‌బాల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Oct 2022 2:13 AM GMT
ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 127 మంది మృతి

అప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించారు. అయితే.. త‌మ జ‌ట్టు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు చేతిలో ఓడిపోవ‌డాన్ని కొంద‌రు అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు. ఈ క్ర‌మంలో ఇరు జ‌ట్ల అభిమానుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఒక‌రినొక‌రు దూషించుకుంటూ కొట్టుకోవ‌డం మొద‌లుపెట్టారు. క్ర‌మ క్ర‌మంగా అక్క‌డ ప‌రిస్థితి చేయిదాటుతోంది. దీంతో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చేందుకు పోలీసులు టీయ‌ర్ గ్యాస్‌ను ప్ర‌యోగించి లాఠీఛార్జ్ చేశారు. ఒక్క‌సారిగా ప్రేక్ష‌కులు ప‌రుగులు తీయ‌డంతో తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 127 మంది మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న ఇండోనేషియాలో జ‌రిగింది.

తూర్పుజావాలోని మ‌లాంగ్ రీజెన్సీలోని కంజురుహాన్ స్టేడియంలో శ‌నివారం రాత్రి అరెమా ఎఫ్‌సి, పెర్సెబయా సురబయ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు మైదానానికి త‌ర‌లి వ‌చ్చారు. ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్‌లో అరేమా 3-2 తేడాతో ఓడిపోయింది. సొంత మైదానంలో జ‌రిగిన‌ మ్యాచ్‌లో అరేమా జ‌ట్టు ఓట‌మిని అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు. కొంద‌రు అభిమానులు గుంపులుగా ఏర్ప‌డి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు అభిమానులను దూషించ‌డంతో పాటు కొట్ట‌డం మొద‌లుపెట్టారు. అడ్డుకోబోయిన అధికారుల‌ను సైతం విడిచిపెట్ట‌లేదు.

ఇరుజ‌ట్ల మ‌ధ్య అభిమానులు కొట్లాట‌కు దిగ‌డంతో అక్క‌డ ప‌రిస్థితి అదుపుత‌ప్పింది. స‌మాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్య‌లో మైదానానికి చేరుకున్నారు. ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియ‌ర్ గ్యాస్ ను ప్ర‌యోగించారు. దీంతో వేలాది మంది అభిమానులు ఊపిరిపీల్చుకోవ‌డానికి ఇబ్బందులు ప‌డ్డార‌ని, దీంతో మైదానంలోంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశార‌ని, ఈ క్ర‌మంలో అక్క‌డ తొక్కిస‌లాట చోటు చేసుకుంద‌ని స్థానిక మీడియా వెల్ల‌డించింది.

ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 127 మంది మ‌ర‌ణించార‌ని, అందులో ఇద్ద‌రు పోలీసులు ఉన్నారు. మ‌రో 180కి పైగా మంది గాయ‌ప‌డ్డారు. కాగా.. ఘ‌ట‌నాస్థ‌లంలోనే 34 మంది ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన వారు చికిత్స పొందుతూ ఆస్ప‌త్రిలో మ‌ర‌ణించిన‌ట్లు తూర్పు జావా పోలీసు చీఫ్ నికో అఫింటా ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై ఇండోనేషియా ఫుట్‌బాల్ అసోసియేష‌న్ ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది.

ఈ ఘ‌ట‌న‌పై ఇండోనేషియా క్రీడా మంత్రి జైనుదిన్ అమాలీ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఇదో దుర‌దృష్ట సంఘ‌ట‌న‌గా అభివ‌ర్ణించారు. దీనిపై అధికారులు ద‌ర్యాప్తు ప్రారంభించిన‌ట్లు వెల్ల‌డించారు. భ‌ద్ర‌తా అంశం తెర‌పైకి వ‌చ్చింద‌ని, అందుక‌నే అధికారులు దీనిపై దృష్టిసారించిన‌ట్లు తెలిపారు. మైదానంలోకి ప్రేక్ష‌కుల‌ను నిషేదించే అంశంపైనా చ‌ర్చిస్తున్న‌ట్లు తెలిపారు.

కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మలాంగ్‌లోని స్టేడియంలోని అభిమానులు పిచ్ మ‌ధ్య‌లోకి ప‌రుగెత్తుతున్న దృశ్యాల‌ను స్థానిక మీడియా ఛానెళ్లు ప్ర‌సారం చేశాయి.



Next Story