రహస్యంగా ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో కూతురి పెళ్లి చేసిన పాక్‌ ఆర్మీ చీఫ్

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తన కుమార్తె వివాహం డిసెంబర్ 26న రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిపారు.

By -  Medi Samrat
Published on : 31 Dec 2025 3:34 PM IST

రహస్యంగా ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో కూతురి పెళ్లి చేసిన పాక్‌ ఆర్మీ చీఫ్

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తన కుమార్తె వివాహం డిసెంబర్ 26న రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిపారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. కుమార్తె మహనూర్ వివాహం అతని స్వంత మేనల్లుడు కెప్టెన్ అబ్దుల్ రెహ్మాన్ ఖాసిమ్‌తో జ‌రిపించారు. భద్రతా కారణాల దృష్ట్యా.. ఈ వివాహాన్ని పూర్తిగా ప్రైవేట్‌గా జ‌రిపించారు. అధికారిక ఫోటోలు కూడా విడుద‌ల చేయ‌లేదు.

పాకిస్తాన్ జర్నలిస్ట్ జాహిద్ గిష్కోరి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక వీడియోను షేర్ చేయ‌డం ద్వారా ఈ వివాహాన్ని ధృవీకరించారు, అయితే ఈ వీడియో తర్వాత తొలగించబడింది. "ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ కుమార్తె మహనూర్‌ను అతని సోదరుడి కుమారుడు(వరుసకు బావమరిది) కెప్టెన్ అబ్దుల్ రెహ్మాన్ ఖాసిమ్‌కు ఇచ్చి వివాహం జ‌రిపించారు" అని రాశారు.

నివేదికల ప్రకారం, వివాహానికి దాదాపు 400 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. వీరిలో పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఉప ప్రధాని ఇషాక్ దార్, పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్, ISI చీఫ్ మరియు పలువురు ప్రస్తుత మరియు మాజీ సీనియర్ సైనిక అధికారులు ఉన్నారు. వేడుకను ఉద్దేశపూర్వకంగా లో ప్రొఫైల్‌గా, మీడియాకు దూరంగా ఉంచారు.

జనరల్ అసిమ్ మునీర్ మేనల్లుడు అయిన కెప్టెన్ అబ్దుల్ రెహ్మాన్ ఖాసిం గతంలో పాకిస్తాన్ ఆర్మీలో కెప్టెన్‌గా నియమించబడ్డాడు. సైన్యాన్ని విడిచిపెట్టిన తర్వాత అతను సైనిక అధికారులకు కేటాయించిన కోటాలో పౌర పరిపాలనలో ప్రవేశించాడు. ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జనరల్ మునీర్‌కు నలుగురు కుమార్తెలు ఉండ‌గా.. ఇది అతని మూడవ కుమార్తె వివాహం.

Next Story