హింసాకాండతో అతలాకుతలమైన బంగ్లాదేశ్‌లో మంగళవారం మరో హిందూ వ్యక్తి ఒక గుంపు వెంబడించడంతో మరణించాడు. తాజాగా దొంగతనం ఆరోపణలతో ఓ అల్లరి మూక వెంటపడటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కాలువలోకి దూకిన ఓ హిందూ యువకుడు మృతి చెందాడు. నౌగావ్ జిల్లాలోని మహాదేవ్‌పూర్ ఉపజిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం చాక్‌గోరి ప్రాంతానికి చెందిన మిథున్ సర్కార్ (25) అనే యువకుడిపై కొందరు దొంగతనం నెపం మోపి వెంబడించారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మిథున్ సమీపంలోని లోతైన కాలువలోకి దూకాడు. అయితే, నీటి ప్రవాహం బలంగా ఉండటంతో అందులో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల తర్వాత మిథున్ మృతదేహాన్ని వెలికితీశారు.