ఈ ఫోటోలో ఉన్న మహిళ ఎవరో తెలుసా?
యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఎలిజబెత్ ఫ్రాన్సిస్ 115 సంవత్సరాల వయస్సులో మరణించారు.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 3:02 PM ISTయునైటెడ్ స్టేట్స్‌లో అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఎలిజబెత్ ఫ్రాన్సిస్ 115 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఫ్రాన్సిస్ మంగళవారం నాడు ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో శాంతియుతంగా మరణించారు. ఈ విషయాన్ని ఆమె సంరక్షకురాలు, మనవరాలు ఎథెల్ హారిసన్ ధృవీకరించారు. ప్రపంచంలోని అత్యంత వృద్ధుల గ్లోబల్ డేటాబేస్ లాంగేవిక్వెస్ట్ ప్రకారం, ఆమె మరణించే సమయానికి, ఫ్రాన్సిస్ USలో జీవించి ఉన్న అతి పెద్ద వ్యక్తి, ప్రపంచంలో బతికి ఉన్న వృద్ధుల లిస్టులో మూడవ స్థానంలో ఉన్నారు. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో గడిపారు.
ఫ్రాన్సిస్‌ను "అమెరికా అమ్మమ్మ" అని పిలిచేవారు. ఫ్రాన్సిస్ జూలై 25, 1909న లూసియానాలో జన్మించింది. ఆమె మొదటి ప్రపంచ యుద్ధం నుండి టైటానిక్ మునిగిపోయే వరకు అన్ని సందర్భాల్లోనూ జీవించి ఉంది. ఆమె తన కుమార్తెను ఒంటరి తల్లిగా పెంచింది, హ్యూస్టన్‌లో కాఫీ షాప్ నడిపేవారు. డ్రైవింగ్ కంటే నడకను ఎక్కువగా ఇష్టపడింది. ఈ సంవత్సరం ప్రారంభంలో తన 115వ పుట్టినరోజు జరుపుకుంది ఫ్రాన్సిస్.
కాలిఫోర్నియాలో 116వ పుట్టినరోజు తర్వాత ఈడీ సెకరెల్లి మరణించిన తర్వాత, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రాన్సిస్ అమెరికా దేశంలోని అతి పెద్ద వ్యక్తిగా కిరీటం పొందారు. ఏప్రిల్‌లో, ఆమెకు లాంగేవిక్వెస్ట్ నుండి USలో అత్యంత వృద్ధ వ్యక్తిగా గుర్తించే సర్టిఫికెట్ కూడా లభించింది. ఇప్పుడు, లాంగేవిక్వెస్ట్ ప్రకారం అమెరికా లో అత్యంత వయసు ఉన్న లిస్టులో నవోమి వైట్‌హెడ్ నిలిచారు. సెప్టెంబర్ 26, 1910న జన్మించారు.