అగ్ర రాజ్యం అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే భారతీయ విద్యార్థులతో పాటు ఇతర అంతర్జాతీయ విద్యార్థులకు యూఎస్ గవర్నమెంట్ కీలక హెచ్చరిక జారీ చేసింది. స్టూడెంట్ వీసా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. తరగతులకు సరిగా హాజరుకాకపోవడం, చదువుతున్న విద్యాసంస్థకు సమాచారం ఇవ్వకుండా కోర్సు నుంచి వైదొలగడం వంటి చర్యలకు పాల్పడితే విద్యార్థుల వీసాలను రద్దు చేస్తామని మంగళవారం హెచ్చరించింది. అంతేకాకుండా, అలాంటి విద్యార్థులు భవిష్యత్తులో అమెరికా వీసాలు పొందే అర్హతను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.
"మీరు చదువు మధ్యలో మానేసినా, తరగతులకు హాజరుకాకపోయినా, లేదా మీ విద్యాసంస్థకు తెలియజేయకుండా మీ స్టడీ ప్రోగ్రామ్ నుంచి నిష్క్రమించినా, మీ స్టూడెంట్ వీసా రద్దు చేయవచ్చు. భవిష్యత్తులో అమెరికా వీసాలకు మీరు అనర్హులు కావచ్చు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఎల్లప్పుడూ మీ వీసా షరతులకు కట్టుబడి ఉండండి, మీ స్టూడెంట్ స్టేటస్‌ను కాపాడుకోండి" అని యూఎస్ ఎంబసీ తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేసింది.