యూఎస్ H-1B వీసా విధానంపై మరోసారి కీలక మార్పులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి H-1B వీసా విధానంపై కీలక మార్పులు ప్రతిపాదించింది
By - Knakam Karthik |
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి H-1B వీసా విధానంపై కీలక మార్పులు ప్రతిపాదించింది. H-1B వీసా దరఖాస్తు ఫీజు $100,000 (సుమారు ₹83 లక్షలు) గా పెంచుతూ కొత్త నిబంధనను ప్రకటించింది. గతంలో ఈ ఫీజు కంపెనీ పరిమాణం ఆధారంగా $215 నుండి $5,000 మధ్య ఉండేది. మంగళవారం విడుదల చేసిన ఫెడరల్ రిజిస్టర్ నోటీసు ప్రకారం, వీసాల కోసం డిమాండ్ ఎక్కువగా ఉన్నపుడు లాటరీ పద్ధతికి బదులు, జీత స్థాయిల ఆధారంగా ఎంపిక జరగనుంది. అధిక వేతనాలు చెల్లించే ఉద్యోగాలకు వీసా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ అంచనాల ప్రకారం, ఈ మార్పుల వల్ల 2026 ఆర్థిక సంవత్సరంలో H-1B కార్మికుల వేతనాలు $502 మిలియన్ మేర పెరుగుతాయి. 2027లో $1 బిలియన్, 2028లో $1.5 బిలియన్, 2029-2035 మధ్యలో $2 బిలియన్ అదనపు వేతనాలు చెల్లించాల్సి వస్తుంది. అయితే, సుమారు 5,200 చిన్న వ్యాపారాలు తీవ్రమైన మానవ వనరుల లోటుతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని DHS హెచ్చరించింది.
భారతదేశం, చైనా నుండి వచ్చే టెక్ ప్రొఫెషనల్స్‌కు అత్యంత కీలకమైన H-1B వీసా పై భారీ ఫీజు పెంపు మరియు కొత్త ఎంపిక విధానం గ్లోబల్ టాలెంట్‌ను అమెరికాకు రావడంలో నిరుత్సాహపరచవచ్చని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో, అమెరికన్ కార్మికుల రక్షణకు, తక్కువ వేతనాలతో విదేశీ కార్మికులను నియమించడాన్ని అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.