భారత్ కు సహాయం చేసేందుకు అమెరికా నుంచి స్ట్రైక్ టీం
America assurance to india to help on covid 19 control. అమెరికా చేయనున్న సాయంపై మంగళవారం వైట్ హౌస్ అధికారి ప్రకటన చేశారు. భారత్ కు సాయం చేసేందుకు 'స్ట్రైక్ టీం'ను పంపిస్తున్నట్టు చెప్పారు.
By తోట వంశీ కుమార్ Published on 28 April 2021 6:44 AM GMTభారత్ కు సాయం చేసే విషయంపై అమెరికా మరో ముందడుగు వేసింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ లో మాట్లాడారు. తాజాగా అమెరికా చేయనున్న సాయంపై మంగళవారం వైట్ హౌస్ అధికారి ప్రకటన చేశారు. భారత్ కు సాయం చేసేందుకు 'స్ట్రైక్ టీం'ను పంపిస్తున్నట్టు చెప్పారు.
ఆ టీంలో ప్రజారోగ్య నిపుణులు ఉంటారని చెప్పారు. స్ట్రైక్ టీంను ఇండియాకు పంపించడం కోసం యూఎస్ఏఐడీ, అమెరికా సీడీసీ పనిచేస్తున్నాయన్నారు. భారత ఆరోగ్య నిపుణులు, ఆరోగ్య సిబ్బందితో కలిసి పనిచేసేందుకు ఇప్పటికే తమ ఎంబసీ అధికారులను సంప్రదించినట్టు చెప్పారు. లేబొరేటరీ సేవలు, నిఘా, ఎపిడెమియాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, కరోనా వైరస్ జన్యు క్రమ నిర్ధారణ, వ్యాధి నమూనాలు, మహమ్మారి నివారణ, నియంత్రణ తదితరాలపై తమ నిపుణులు సాయంగా ఉంటారని చెప్పారు.
భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ ఉత్పత్తి కోసం తగినంత ముడిసరుకును పంపిస్తామన్నారు. అలాగే భారత్ కు ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థలు ఇచ్చేందుకు, ఆక్సిజన్ సరఫరా చైన్ అభివృద్ధి కోసం ఇప్పటికే అమెరికా రక్షణ శాఖ, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ లు పనిచేస్తున్నాయన్నారు.
ఆక్సిజన్ సిలిండర్ల కాంట్రాక్ట్ కు సంబంధించి ఇప్పటికే విదేశాంగ శాఖ తుది నిర్ణయం తీసేసుకుందన్నారు. ఆక్సిజన్ కానసన్ట్రేటర్లు, వెంటిలేటర్లూ ఇచ్చే విషయంపైనా చర్చలు జరుగుతున్నాయన్నారు. భారత్ తో సాంకేతిక అంశాలపై చర్చలు జరుపుతున్నామని చెప్పారు. భారత్ కోరిన అన్ని విభాగాల్లోనూ సిబ్బందికి శిక్షణనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్ కు త్వరితగతిన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను పంపిస్తామని హామీ ఇచ్చారు. కరోనా టెస్ట్ కిట్లు, పీపీఈ కిట్లు తదితరాలనూ వెంటనే భారత్ కు పంపిస్తామని తెలిపారు.
మరోవైపు కరోనా తీవ్రత నేపథ్యంలో అమెరికా వీసా ప్రక్రియలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ మంగళవారం ప్రకటించింది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం వచ్చే నెల మూడో తేదీ నుంచి జరగాల్సిన అన్ని ఇంటర్వ్యూలు, డ్రాప్‌బాక్స్ ప్రక్రియలను నిలిపివేసింది. వీసా ప్రక్రియను తిరిగి ఎప్పుడు ఆరంభించేది తరవాత ప్రకటిస్తామని పేర్కొంది. అమెరికా సిటిజన్ సర్వీసులకు సంబంధించిన ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను మంగళవారం నుంచే నిలిపివేసినట్లు వెల్లడించింది. అమెరికా పౌరుల అత్యవసర సేవలు, వీసా అపాయింట్‌మెంట్లను స్థానిక పరిస్థితులు అనుకూలించిన మేరకు అనుమతిస్తామంది. అత్యవసరాలపై ఇప్పటికే తీసుకున్న ఇంటర్వ్యూ తేదీలను యథావిధిగా సాధ్యమైనంత మేరకు అనుమతిస్తామని పేర్కొంది.