చైనాకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన భారత వాయుసేన

Air Force Chief Marshal RKS Bhadauria warns China. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా దూకుడు ప్రదర్శిస్తే తాము కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన భారత వాయుసేన.

By Medi Samrat  Published on  24 Jan 2021 1:00 PM GMT
Air Force Chief Marshal RKS Bhadauria warns China

వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా దూకుడు ప్రదర్శిస్తే తాము కూడా దూకుడుగానే బదులిస్తామని భారత వాయుసేన చెబుతోంది. చైనా లడఖ్ ప్రాంతంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడం తాము చూస్తూ ఊరికే ఉండమని భారత వాయుసేన ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా తెలిపారు. భారత్, ఫ్రాన్స్ వైమానిక దళాలు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో సంయుక్తంగా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. డెజర్ట్ నైట్-2021 పేరిట జనవరి 20 నుంచి 24 వరకు ఈ విన్యాసాలు జరుగుతాయి. భదౌరియా శనివారం నాడు మాట్లాడుతూ, తమ యుద్ధ సన్నద్ధతను చాటారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనా దూకుడు ప్రదర్శిస్తే తాము కూడా దూకుడుగానే బదులిస్తామని.. చైనాను ధీటుగా ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేశారు. భారత వాయుసేనను మరింత బలోపేతం చేసేలా ఇప్పటికే 8 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు చేరుకున్నాయని, మరో మూడు విమానాలు జనవరి చివరినాటికి వస్తాయని అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ లో చైనా దూకుడుగా ప్రవర్తిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. సంవత్సరకాలంలో అక్కడ ఏకంగా ఓ గ్రామాన్నే చైనా నిర్మించింది. చైనా అది తమ భూభాగమేనని చెప్పుకుంటూ ఉంది. చైనా దూకుడుగా వ్యవహరిస్తే తాము కూడా అంతకంటే దూకుడుగా వ్యవహరిస్తామని భారత వాయుసేన హెచ్చరికలు జారీ చేసింది. తాము సర్వ సన్నద్ధం అయి ఉన్నామని చెప్పుకొచ్చారు. తూర్పున ఉన్న సరిహద్దుల్లో మిలిటరీ ట్రైనింగ్స్ ను కూడా పెంచుతామని భదౌరియా చెప్పుకొచ్చారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్టమయ్యేలా చర్యలు తీసుకోవాలి కానీ.. ఇలా రెచ్చగొట్టేలా చర్యలు చేపడితే మాత్రం తిప్పికొట్టగల సత్తా తమకు ఉందని అన్నారు. భారత సరిహద్దుల్లో చైనా గ్రామాన్ని నిర్మించడం తమ దృష్టికి వచ్చిందని.. చాలా ఏళ్లుగా ఇలాంటి పనులు చేస్తూ ఉందని అన్నారు. భారత ప్రభుత్వం కూడా సరిహద్దు ప్రాంతాలకు రోడ్లు, బ్రిడ్జ్ లను నిర్మిస్తూ చైనాకు బుద్ధి చెబుతూ ఉందని అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలోకి చైనా 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చినట్టు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అక్కడ 101 ఇళ్లతో ఈ గ్రామాన్ని నిర్మించింది. ఈ నిర్మాణాలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై చైనా స్పందించింది. తాము తమ భూభాగంలోనే నిర్మాణాలు చేపట్టామని చెబుతోంది. ఇది తమ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమని, సాధారణ విషయమేనని అంటోంది. తూర్పు సెక్టార్ లోని చైనా-భారత్ సరిహద్దు (చైనా టిబెట్ దక్షిణ భాగం) విషయంలో చైనా వైఖరి స్థిరంగా, చాలా స్పష్టంగా ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునైంగ్ అన్నారు. చైనాకు చెందిన భూభాగంలో అరుణాచల్ ప్రదేశ్ అనే ప్రాంతాన్ని భారత్ అక్రమంగా ఏర్పాటు చేసిందని అరుణాచల్ ను తాము ఎన్నడూ గుర్తించలేదని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ ను తాము దక్షిణ టిబెట్ గానే పరిగణిస్తున్నామని తెలిపారు.


Next Story