బంగ్లాదేశ్‌లో అధ్వాన్నంగా హిందువుల పరిస్థితి.. ఇళ్లు, దేవాలయాలపై దాడులు

బంగ్లాదేశ్‌లో హింస ఇంకా కొనసాగుతోంది. భారీ అగ్నిప్రమాదంతో పరిస్థితి మరీ దారుణంగా మారింది.

By Medi Samrat  Published on  6 Aug 2024 2:16 PM IST
బంగ్లాదేశ్‌లో అధ్వాన్నంగా హిందువుల పరిస్థితి.. ఇళ్లు, దేవాలయాలపై దాడులు

బంగ్లాదేశ్‌లో హింస ఇంకా కొనసాగుతోంది. భారీ అగ్నిప్రమాదంతో పరిస్థితి మరీ దారుణంగా మారింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన తర్వాత కూడా నిరసనకారులు వీధుల్లోనే ఉన్నారు. అదే సమయంలో దేశంలో హిందువుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడులు చేసేంత దారుణంగా పరిస్థితి తయారైంది. నిర‌స‌న‌కారులు 27 జిల్లాల్లో హిందువుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడి చేసి వారి విలువైన వస్తువులను దోచుకున్నారు. దేశవ్యాప్తంగా నాలుగు దేవాలయాలను ధ్వంసం చేశారు.

బంగ్లాదేశ్‌లోని ది డైలీ స్టార్‌లోని ఒక కథనం ప్రకారం.. గత సాయంత్రం తేలిపారా గ్రామంలో లాల్మోనిర్హత్ పూజ ఉద్యాపన్ పరిషత్ కార్యదర్శి ప్రదీప్ చంద్ర రాయ్ ఇంటిని నిరసనకారుల గుంపు ధ్వంసం చేసి దోచుకుంది. ఇది మాత్రమే కాదు.. పూజ ఉద్యాపన్ పరిషత్ మున్సిపాలిటీ సభ్యుడు ముహిన్ రాయ్‌కు చెందిన కంప్యూటర్ దుకాణాన్ని కూడా ధ్వంసం చేసి దోచుకున్నారు. చంద్రపూర్ గ్రామంలో నాలుగు హిందూ కుటుంబాల ఇళ్లను లూటీ చేశారు.

హతిబంధ ఉపజిల్లాలోని పుర్బో సర్దుబీ గ్రామంలో గత రాత్రి 12 హిందూ ఇళ్లను దగ్ధమ‌య్యాయి. సదర్ ఉపజిల్లాలో అనేక హిందూ ఇళ్ళు ధ్వంసం చేసి.. దోచుకున్నారు. ఐక్య పరిషత్ సీనియర్ జాయింట్ జనరల్ సెక్రటరీ మోనీంద్ర కుమార్ నాథ్‌తో పాత్రికేయులు మాట్లాడుతుండ‌గా.. అతని బాధ స్పష్టంగా కనిపించింది. తన సంఘంపై ఇలాంటి దాడులు జరుగుతాయని తాను ఎప్పుడూ అనుకోలేదని నాథ్ అన్నారు.

మతపరమైన దాడులు జరగని ప్రాంతం లేదా జిల్లా మిగిలి ఉండదని ఆయన అన్నారు. గృహాలు, వ్యాపార సంస్థలపై దాడుల గురించి మేము దేశంలోని వివిధ ప్రాంతాల నుండి నిరంతరం నివేదికలను స్వీకరిస్తున్నాము. తమను కొడుతున్నారని.. ఇళ్లను, వ్యాపారాలను దోచుకుంటున్నారని ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మా తప్పేంటి? మేం దేశ పౌరులం కాక‌పోవడం మా తప్పా? అని ప్ర‌శ్నించారు. దేశంలోని హిందువులు దాడులకు భయపడుతున్నారని మోనీంద్ర కుమార్ నాథ్ పేర్కొన్నారు. ఇలాంటి దాడులు ఇక్కడే కొనసాగితే మేం ఎక్కడికి వెళ్లాల‌ని ఆయన ప్రశ్నించారు. హిందూ సమాజ సభ్యులను ఎలా ఓదార్చాలని విచారం వ్య‌క్తం చేశారు.

బంగ్లాదేశ్‌లోని నిరసనకారులు సోమవారం ఢాకాలోని ఇండియా కల్చర్ సెంటర్‌పై దాడి చేశారు. అంతేకాకుండా, కాళీ, ఇస్కాన్‌తో సహా దేశవ్యాప్తంగా కనీసం నాలుగు ఆలయాలు కూడా ధ్వంసమయ్యాయి.

షేక్ హసీనాను అధికారం నుంచి తప్పించారనే వార్త దేశవ్యాప్తంగా వ్యాపించిన వెంటనే హిందూ దేవాలయాలపై దాడులు మొదలయ్యాయని హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ నాయకురాలు కాజోల్ దేబ్నాథ్ అన్నారు. హిందువులు సహా అన్ని మైనారిటీ వర్గాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఢాకాలోని ధన్మొండి ప్రాంతంలో ఉన్న ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్‌పై ఆకతాయిలు దాడి చేసి తీవ్రంగా ధ్వంసం చేశారని అన్నారు. దీంతో పాటు పలుచోట్ల ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వీటిలో ధన్మొండిలోని బంగబంధు భవన్ కూడా ఉంది, దీనిని బంగబంధు మెమోరియల్ మ్యూజియం అని కూడా పిలుస్తారు.

దినాజ్‌పూర్ పట్టణం, ఇతర ఉపజిల్లాలలో 10 హిందూ గృహాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు నిర‌స‌నకారులు. నగరంలోని రైల్‌బజార్‌హట్‌లోని ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు కొంత‌మంది ప్రయత్నించారు, అయితే స్థానిక ప్రజలు అడ్డుకున్నారు.

బరాబుందర్ ప్రాంతానికి చెందిన దివంగత కోలాష్ చంద్ర రాయ్, బారాబందర్‌కు చెందిన నిత్యా గోపాల్, గుంజబరి ప్రాంతానికి చెందిన బును బిస్వాస్, దినాజ్‌పూర్‌లోని బిరల్ ఉపజిల్లాకు చెందిన రోమా కాంత్ రాయ్ ఇళ్లపై దాడులు జరిగినట్లు వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్ ప్రధాన కార్యదర్శి ఉత్తమ్ కుమార్ రాయ్ మాట్లాడుతూ.. ఖాన్‌సామా ఉపజిల్లాలో మూడు హిందువుల ఇళ్లపై దాడి జరిగిందని తెలిపారు. లక్ష్మీపూర్‌లోని ఐక్య పరిషత్ అసిస్టెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గౌతమ్ మజుందార్ మాట్లాడుతూ.. రాత్రి 7.30 గంటల సమయంలో 200-300 మందికి పైగా దుండగులు తమ రెండంతస్తుల భవనానికి నిప్పుపెట్టారని చెప్పారు.

Next Story