ఆఫర్ పేరుతో టీవీ నటికి లైంగిక వేధింపులు.. డైరెక్టర్ అరెస్ట్
లైంగిక వేధింపులు, మోసం, క్రిమినల్ బెదిరింపు ఆరోపణలపై రాజాజీనగర్ పోలీసులు బెంగళూరులో నటుడు, దర్శకుడు, నిర్మాత బిఐ హేమంత్ కుమార్‌ను అరెస్టు చేశారు.
By - Medi Samrat |
లైంగిక వేధింపులు, మోసం, క్రిమినల్ బెదిరింపు ఆరోపణలపై రాజాజీనగర్ పోలీసులు బెంగళూరులో నటుడు, దర్శకుడు, నిర్మాత బిఐ హేమంత్ కుమార్‌ను అరెస్టు చేశారు. ఒక టెలివిజన్ నటి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్టు జరిగింది. ఫిర్యాదు ప్రకారం, హేమంత్ 2022లో నటిని సంప్రదించి '3' అనే చిత్రంలో ప్రధాన పాత్రను చేయమనడానికి ఒప్పందంపై సంతకం చేశారు. పారితోషికంగా రూ.2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి, అందులో రూ.60,000 ముందుగానే చెల్లించారు.
తరువాత, హేమంత్ షూటింగ్‌ను ఆలస్యం చేశారు. అయితే ఆ మహిళను వేధించడం మొదలు పెట్టాడు. కురచ దుస్తులు ధరించాలని, అశ్లీలంగా ఉండాలంటూ పట్టుబట్టడం ద్వారా తనను వేధించడం ప్రారంభించాడని ఫిర్యాదుదారు ఆరోపించారు. చిత్రీకరణ సమయంలో అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అతడు చెప్పినట్లుగా చేయడానికి నిరాకరించినప్పుడు తనను బెదిరించాడని ఆమె పేర్కొంది. ఫిల్మ్ ఛాంబర్ మధ్యవర్తిత్వం తర్వాత తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసినప్పటికీ, హేమంత్ తనను వేధించడం, బెదిరించడం కొనసాగించాడని ఆమె ఆరోపించారు.
2023లో ముంబైలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో హేమంత్ తనకు మద్యం తాగించి, మత్తులో ఉన్న సమయంలో పలు రకాలుగా చిత్రీకరించాడని, ఆ తర్వాత ఆ వీడియోను ఉపయోగించి బ్లాక్‌మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ప్రతిఘటించినప్పుడు, బెదిరించడానికి గూండాలను పంపాడని, ఆమెకు ఆమె తల్లికి ప్రాణహాని కలిగించాడని వివరించింది. సెన్సార్ బోర్డు అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ఎడిట్ చేసిన, సెన్సార్ చేయని వీడియో క్లిప్‌లను పోస్ట్ చేయడం, ఆమె వ్యక్తిగత వివరాలను పంచుకోవడం, బహిరంగంగా ఆమె పరువు తీయడం వంటి ఆరోపణలు కూడా అతనిపై ఉన్నాయి. సదరు నటి బెంగళూరు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది, ఇది హేమంత్ ఎటువంటి వీడియోలను అప్‌లోడ్ చేయకుండా మధ్యంతర నిషేధాన్ని జారీ చేసింది. అతను ఆ ఉత్తర్వును ఉల్లంఘించాడు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను పోస్ట్ చేయడం కొనసాగించాడని ఆరోపించింది. దర్యాప్తు కొనసాగుతున్నందున హేమంత్‌ను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.