కాల్పులకు తెగబడ్డ దుండగుడు.. ఎనిమిది మంది మృతి
8 People Killed in Atlanta-Area Massage Parlor Shootings. అట్లాంటాలోని మసాజ్ పార్లర్లలో ఓ దుండగుడు కాల్పులు జరుపడంతో ఎనిమిది మంది మృతిచెందారు.
By Medi Samrat Published on 17 March 2021 3:51 AM GMT
అమెరికాలో ఓ దుండగుడు దారుణానికి ఒడిగట్టాడు. అట్లాంటాలోని మసాజ్ పార్లర్లలో ఓ దుండగుడు కాల్పులు జరుపడంతో ఎనిమిది మంది మృతిచెందారు. మొదట కాల్పులు జరిగిన సమయంలో పోలీసులు దోపిడీగా భావించారు. ఆపై మరో రెండు మసాజ్ సెంటర్ల వద్ద కూడా కాల్పులు జరపడంతో ఇందుకు గల కారణాలు ఏంటో తెలియాల్సివుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా.. ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరిలో ఆరుగురు ఆసియన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ విషయమై చెరోకీ కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి చెందిన కెప్టెన్ జే బేకర్ మాట్లాడుతూ.. మొదట కాల్పులు జరిగిన సమయంలో పోలీసులు దోపిడీగా భావించారు. మొదటగా వాయువ్య ప్రాంతంలోని అక్వర్త్ సమీపంలోని యంగ్స్ ఏషియన్ మసాజ్ సెంటర్ వద్ద జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారని తెలిపారు. అక్కడే మరో వ్యక్తి గాయపడ్డాడని.. ఈ ఘటన సాయంత్రం 5 గంటలకు జరిగిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈశాన్య ప్రాంతంలో 5.47గంటల సమయంలో గోల్డ్ స్పా వద్ద జరిపిన కాల్పులలో ముగ్గురు మహిళల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చివరగా అరోమాథెరపీ స్పా వద్ద మరోమారు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ మరో మహిళ మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
అయితే.. కాల్పులకు తెగబడిన దుండగుడిని రాత్రి 8.30గంటల ప్రాంతంలో జార్జియాలోని క్రిస్ప్ కౌంటీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని వుడ్‌స్టాక్‌కు చెందిన రాబర్డ్ ఆరోన్‌లాంగ్ గా గుర్తించినట్లు కెప్టెన్ జే బేకర్ పేర్కొన్నారు. దుండగుడు ఎందుకు కాల్పులకు తెగబడ్డాడో తెలియాల్సివుందని జే బేకర్ చెప్పుకొచ్చారు.