కీవ్ వైపు దూసుకువెలుతున్న 64 కి.మీ భారీ ర‌ష్య‌న్ కాన్వాయ్

64 KM Long Russian military convoy heads for Kiev.ఉక్రెయిన్‌పై ర‌ష్యా ప్రారంభించిన యుద్దం 6వ రోజుకు చేరుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 March 2022 11:48 AM IST
కీవ్ వైపు దూసుకువెలుతున్న 64 కి.మీ భారీ ర‌ష్య‌న్ కాన్వాయ్

ఉక్రెయిన్‌పై ర‌ష్యా ప్రారంభించిన యుద్దం 6వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ ను ఆక్ర‌మించుకునేందుకు ర‌ష్యా సేన‌లు ముందుకు సాగుతున్నాయి. ఓ భారీ కాన్వాయ్ కీవ్ న‌గ‌రం వైపు వెలుతున్న‌ట్లు శాటిలైట్‌(ఉప‌గ్ర‌హ‌) చిత్రాల ద్వారా తెలుస్తోంది. మాక్సర్ టెక్నాలజీస్ ఈ చిత్రాల‌ను విడుద‌ల చేసింది. దీని పొడ‌వు దాదాపు 40 మైళ్లు(64కి.మీ) ఉన్న‌ట్లు చెప్పింది. ఇవాన్‌కీవ్ స‌మీపంలో తీసిన ఫోటోల‌ను మాక్స‌ర్ విడుద‌ల చేసింది.

మొద‌ట 27 కిలోమీట‌ర్ల పొడ‌వు ఉన్న‌ట్లు చెప్పిన మాక్స‌ర్ టెక్నాల‌జీ త‌రువాత త‌న రిపోర్టును స‌రి చేసుకుంది. దాదాపు 4 మైళ్ల పొడ‌వు ఉన్న‌ట్లు చెప్పింది. ఇక‌ మాక్సర్ టెక్నాలజీస్ నుండి వెలువడిన ఫోటోలు భయపెడుతున్నాయి. కాన్వాయ్‌తో పాటు, కీవ్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాలలో కాలిపోతున్న ఇళ్లను కూడా ఇది చూపిస్తుంది. ప్రస్తుతానికి కాన్వాయ్ కీవ్ యొక్క వాయువ్య ప్రాంతంలో 45 కి.మీ దూరంలో కనిపిస్తుంది. కాన్వాయ్ దక్షిణాన ఆంటోనోవ్ విమానాశ్రయం ప్రాంతం నుండి ప్రారంభ‌మై ఉత్తరాన ప్రైబిర్స్క్ ప్రాంతంలో ముగుస్తుంది. రష్యన్ కాన్వాయ్‌లో వందలాది సైనిక వాహనాలు, ట్యాంకులు, ఫిరంగి తుపాకులు మొదలైనవి ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. సోమ‌వారం బెలారస్‌లో రష్యా మరియు ఉక్రెయిన్ జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. ర‌ష్యా నుంచి ఐదుగురు, ఉక్రెయిన్ నుంచి ఆరుగురు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. దాదాపు మూడున్న‌ర గంట‌లు ఈ భేటీ జ‌రిగింది. ర‌ష్యా బ‌ల‌గాలను త‌మ దేశం నుంచి వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని ఉక్రెయిన్ కోరింది. అయితే.. ఇందుకు ర‌ష్యా ప‌లు ఆంక్ష‌లు పెట్టింది. ముఖ్యంగా నాటోలో చేర‌బోమ‌ని ఉక్రెయ‌న్ లిఖిత పూర్వ‌క హామీ ఇవ్వాల‌ని కోరింది. అయితే.. దీనిపై ఎటు తేల‌క పోవ‌డంతో ఎలాంటి ముందు అడుగు ప‌డ‌లేదు. త్వరలో రెండవ రౌండ్ సమావేశం కూడా జ‌రగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Next Story