1951లో 6 సంవత్సరాల వయసులో కిడ్నాప్ అయ్యాడు.. ఇప్పుడు ఎలా దొరికాడంటే?
లూయిస్ అర్మాండో అల్బినో 1951లో ఓక్లాండ్, కాలిఫోర్నియా పార్క్‌లో ఆడుకుంటున్నపుడు కిడ్నాప్ కు గురయ్యాడు.
By Medi Samrat Published on 23 Sep 2024 7:38 AM GMTలూయిస్ అర్మాండో అల్బినో 1951లో ఓక్లాండ్, కాలిఫోర్నియా పార్క్‌లో ఆడుకుంటున్నపుడు కిడ్నాప్ కు గురయ్యాడు. ఆ సమయంలో అతని వయస్సు 6 సంవత్సరాలు. ఏడు దశాబ్దాల తర్వాత ఆల్బినో తన కుటుంబ సభ్యులను కలుసుకోగలిగాడు. పాత ఫోటోలు, వార్తాపత్రికల క్లిప్పింగ్‌ల సహాయంతో అల్బినో సొంత వాళ్ల దగ్గరకు చేరుకున్నాడు. ఓక్లాండ్‌లోని అల్బినో మేనకోడలు పోలీసులు, FBI, న్యాయ శాఖ సహాయంతో ఈస్ట్ కోస్ట్‌లో నివసిస్తున్న ఆమె మామను గుర్తించింది.
అల్బినో వియత్నాంలో పనిచేసిన మెరైన్ కార్ప్స్ లో భాగంగా ఉన్నాడు. అగ్నిమాపక సిబ్బందిగా కూడా పని చేసి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతని మేనకోడలు, 63 ఏళ్ల అలిడా అలెక్విన్ అల్బినోను కనుగొని జూన్‌లో అతని కాలిఫోర్నియా కుటుంబంతో తిరిగి కలిపింది. ఫిబ్రవరి 21, 1951న, వెస్ట్ ఓక్‌లాండ్ పార్క్ నుండి 6 ఏళ్ల అల్బినోను ఒక మహిళ క్యాండీ కొనిస్తానని చెప్పి తీసుకుని వెళ్ళింది. తన అన్నయ్యతో కలిసి ఆడుకుంటూ ఉండగా అల్బినో కిడ్నాప్ కు గురయ్యాడు. ఆ మహిళ అల్బినోను ఓ జంట దగ్గర విడిచిపెట్టింది. ఈస్ట్ కోస్ట్‌లో అల్బినోను ఓ జంట సొంత కొడుకులా పెంచుకుంది.
70 సంవత్సరాలకు పైగా అల్బినో కనిపించకుండా పోయాడు. కానీ అతడిని సొంత కుటుంబం వెతుకుతూనే ఉంది. అతని ఫోటో బంధువుల ఇళ్లలో వేలాడదీసి ఉంచారని అతని మేనకోడలు తెలిపింది. అతని తల్లి 2005లో మరణించే ముందు వరకూ తన కొడుకు బతికే ఉన్నాడన్న ఆశను వదులుకోలేదు. ఓక్లాండ్ ట్రిబ్యూన్ కథనాల ప్రకారం పోలీసులు, స్థానిక ఆర్మీ బేస్ కు సంబంధించిన సైనికులు, కోస్ట్ గార్డ్, ఇతర ఉద్యోగులు తప్పిపోయిన బాలుడి కోసం అప్పట్లో భారీ అన్వేషణ చేశారు.
లూయిస్ అర్మాండో సోదరుడు, రోజర్ అల్బినో అనేకసార్లు అధికారులను సంప్రదించాడు. తల చుట్టూ వస్త్రం చుట్టుకున్న ఒక స్త్రీ తన సోదరుడిని తీసుకువెళ్లడం గురించి చాలా సార్లు చెబుతూనే ఉండేవాడు రోజర్. అలిడా అలెక్విన్ కు తన సొంత మామ ఇంకా బతికే ఉండవచ్చనే భావన 2020లో వచ్చింది. అలెక్విన్ ఒకసారి ఆన్‌లైన్ DNA పరీక్షను తీసుకుంది. ఓ వ్యక్తితో 22 శాతం మ్యాచ్‌ని చూపించింది. ఆ సమయంలో అతని నుండి సరైన సమాధానాలు, ఎటువంటి ప్రతిస్పందన రాలేదని ఆమె చెప్పింది.
2024 ప్రారంభంలో, అలెక్విన్, ఆమె కుమార్తెలు మళ్లీ వెతకడం ప్రారంభించారు. ఓక్లాండ్ పబ్లిక్ లైబ్రరీని సందర్శించారు. ఆమె ట్రిబ్యూన్ కథనాల మైక్రోఫిల్మ్‌ను చూసింది. లూయిస్, రోజర్‌ల చిత్రాన్ని కలిగి ఉన్న ఫోటోలను కూడా తీసుకుంది. అన్వేషణకు సంబంధించి ఆమె సరైన మార్గంలో ఉందని బలంగా నమ్మింది. ఆమె అదే రోజు ఓక్లాండ్ పోలీసులను కూడా ఆశ్రయించింది.
మిస్సింగ్ వ్యక్తుల కేసు మూసివేశామని ఓక్లాండ్ పోలీసులు చెప్పారు. అయితే FBI మాత్రం కిడ్నాప్ కేసును ఇంకా తెరిచి ఉంచిందని తెలిసింది. ఇలా డీఎన్ఏ మ్యాచ్ అయిందని తెలపగా అధికారులు లూయిస్ ఈస్ట్ కోస్ట్‌లో ఉన్నాడని తెలుసుకున్నారు. జూన్ 20న అధికారులు మీ అంకుల్ బతికే ఉన్నారని తెలియజేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జూన్ 24న, FBI సహాయంతో, లూయిస్ తన కుటుంబ సభ్యులతో ఓక్లాండ్‌కు వచ్చి అలెక్విన్, ఆమె తల్లి, ఇతర బంధువులను కలిశాడు