కామెరూన్ రాజధాని యౌండేలోని స్టేడియంలో జరిగిన భారీ తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. అలాగే చాలా మంది గాయపడ్డారని తెలిసింది. సోమవారం ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ మ్యాచ్ ప్రారంభం అవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ గేమ్ ప్రేక్షకులు.. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఒక్కసారిగా స్టేడియం లోపలికి చొచ్చుకురావడంతో స్టేడియం ఫస్ట్ గేట్ దగ్గర తొక్కిసలాట జరిగింది. కామెరూనియన్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ సీఆర్‌టీవీ ప్రకారం.. "ఒలెంబే స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట" కారణంగా "అర డజను మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు".
ఆఫ్రికా ఖండం యొక్క ఫ్లాగ్‌షిప్ పోటీని నిర్వహిస్తున్న ఆఫ్రికన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్, "సంఘటన" గురించి తెలిసిన తర్వాత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో.. సీఏఎఫ్ "పరిస్థితిని పరిశోధిస్తున్నట్లు, ఏమి జరిగిందనే దానిపై మరిన్ని వివరాలను పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు" తెలిపింది. ఫెడరేషన్ తన సెక్రటరీ జనరల్‌ను "యౌండేలోని ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శించడానికి" పంపినట్లు తెలిపింది. "కామెరూన్ ప్రభుత్వం, స్థానిక ఆర్గనైజింగ్ కమిటీతో నిరంతరం కమ్యూనికేషన్‌లో ఉంది" అని పేర్కొంది. కామెరూన్ వర్సెస్ కొమొరోస్ మధ్య చివరి మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది.