ఆసియన్ల మీద దాడులు.. అమెరికాలో ఆగేదెప్పుడు..!
6 Asian Women Among 8 Shot Dead At Three US Spas. అమెరికాలో జాత్యహంకార దాడులు మరోసారి పెరుగుతూ వెళుతున్నాయి.
By Medi Samrat Published on 17 March 2021 1:44 PM ISTఅమెరికాలో జాత్యహంకార దాడులు మరోసారి పెరుగుతూ వెళుతున్నాయి. ఇప్పటికే ఈ దాడులపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఆగడం లేదు. ఇటీవలి కాలంలో ఆసియా సంతతి వారిపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. ఓ వైపు అరెస్టులు జరుపుతున్నా మరో వైపు దాడులు మాత్రం ఆగడం లేదు. ఈ దాడులకు అమెరికాలోని గన్ కల్చర్ కూడా తోడైనట్లు కనిపిస్తోంది. తాజాగా అట్లాంటాలోని మసాజ్ పార్లర్లలో ఓ దుండగుడు కాల్పులు జరుపడంతో ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా.. ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరిలో ఆరుగురు ఆసియన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మొదటగా వాయువ్య ప్రాంతంలోని అక్వర్త్ సమీపంలోని యంగ్స్ ఏషియన్ మసాజ్ సెంటర్ వద్ద జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. అక్కడే మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన సాయంత్రం 5 గంటలకు జరిగింది. ఆ తర్వాత ఈశాన్య ప్రాంతంలో 5.47గంటల సమయంలో గోల్డ్ స్పా వద్ద జరిపిన కాల్పులలో ముగ్గురు మహిళల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చివరగా అరోమాథెరపీ స్పా వద్ద మరోమారు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ మరో మహిళ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. అయితే.. కాల్పులకు తెగబడిన దుండగుడిని రాత్రి 8.30గంటల ప్రాంతంలో జార్జియాలోని క్రిస్ప్ కౌంటీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని వుడ్‌స్టాక్‌కు చెందిన రాబర్డ్ ఆరోన్‌లాంగ్ గా గుర్తించారు.
21 సంవత్సరాల రాబర్ట్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతడి ఫోటోను కూడా మీడియాకు అందించారు అధికారులు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు ఈ మారణహోమంకు కారణాన్ని ఇంకా గుర్తించకపోయినప్పటికీ.. ఇది తప్పకుండా ఆసియన్ల మీద ఇటీవలి కాలంలో జరుగుతున్న దాడులలో ఒకటిగా పలువురు చెబుతూ ఉన్నారు. అతడు చంపిన వారిలో ఆసియన్లు అధికంగా ఉండడమే అందుకు నిదర్శనం అని అంటున్నారు. ఆసియన్ల మీద ఇటీవలి కాలంలో జరుగుతూ ఉన్న దాడులు అక్కడి ఇండో-ఏషియన్లను తెగ టెన్షన్ పెడుతూ ఉంది. ఏషియన్ అమెరికన్ స్వచ్ఛంద సంస్థల ప్రకారం గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు దాదాపు 3 వేల ఘటనలు జరిగాయి. ఎఫ్బీఐ గణాంకాల ప్రకారం 2019లో కేవలం 216 ఘటనలే జరిగాయి. అమెరికాలోని ఆసియన్లపై జరుగుతున్న దాడులు భయాందోళన కలిగిస్తున్నాయని పలువురు ప్రముఖులు కూడా బాధను వ్యక్తం చేశారు.